రాష్ట్రీయం

తెరుచుకోని ఎటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన 26 రోజుల తరువాత కూడా ఎటిఎంలు పని చేయడం లేదు. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ఆర్‌బిఐ 18 వందల కోట్ల రూపాయల కరెన్సీ పంపించింది. వీటిని జిల్లాలకు తరలించారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితి మెరుగు పడుతుందని, ఎటిఎంలు పని చేస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో ఎటిఎంలు ఏవీ పని చేయలేదు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్ బ్యాంకుల ఎటిఎంలు శనివారం కొన్ని ప్రాంతాల్లో పని చేసినా, ఆదివారం మాత్రం పని చేయలేదు. ఆర్‌బిఐ రోజుకో నిబంధన విధిస్తుండడంతో ప్రజల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో అనే అనుమానంతో బ్యాంకులో డబ్బు ఉండడం కన్నా ఇంట్లో ఉంచుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి, చాలా మంది అవసరం లేకపోయినా నగదు రూపంలోనే ఇంట్లో ఉంచుకుంటున్నారు. కొత్త కరెన్సీ కానీ, వంద రూపాయల నోట్లు కానీ బ్యాంకులకు జమ కావడం లేదు. కరెన్సీ సర్క్యూలేషన్‌లో ఉంటేనే అందుబాటులో ఉంటుంది కానీ మారిన పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి అవసరం లేకపోయినా అవకాశం ఉన్నంత వరకు డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. లాకర్లు కూడా తనిఖీ చేస్తారని, బంగారం లెక్కలు అడుగుతారనే ప్రచారంతో పలువురు బ్యాంకు లాకర్ల నుంచి కూడా బంగారం ఇంట్లో పెట్టుకుంటున్నారు.
ఐదు వందల కోట్ల రూపాయల 500 నోట్లు హైదరాబాద్‌కు వచ్చినా, ముద్రణ లోపాల వల్ల వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి పంపించారు. స్వల్ప సంఖ్యలో హైదరాబాద్‌లో 500 నోట్లు వచ్చాయి. పెద్ద సంఖ్యలో ఐదువందల రూపాయల నోట్లు, వంద రూపాయల నోట్లు వస్తే కానీ పరిస్థితి మెరుగు పడే సూచనలు కనిపించడం లేదు. మూడు రోజుల క్రితం వచ్చిన 18వందల కోట్ల రూపాయల కొత్త కరెన్సీని ఎక్కువగా జిల్లాలకు పంపించారు. ఇక సిద్దిపేటలో క్యాష్‌లెస్ కార్యకలాపాలు పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సిద్దిపేటను మోడల్ నియోజక వర్గంగా ఎంపిక చేసి, అక్కడి ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున నియోజక వర్గంలో క్యాష్ లెస్ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
నగదు రహితంగా మార్కెటింగ్ శాఖ : హరీశ్‌రావు
తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజార్లను నగదు రహితంగా మార్చాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో రోజుకు కనీసం వంద నుంచి రెండువందల నగదు రహిత లావాదేవీలు జరగాలని చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోని మార్కెటింగ్ కమిటీ అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెటింగ్ శాఖ టర్నోవర్ ఏడాదికి 35వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ఇంత పెద్ద శాఖలో నగదు రహిత కార్యకలాపాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు, హమాలీలకు, ఇతర కార్మికులకు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరవాలని చెప్పారు. వరంగల్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆదర్శంగా పని చేస్తున్నారని చెప్పారు. అన్ని రైతు బజార్లను నగదు రహితంగా మార్చాలని మంత్రి సూచించారు.