రాష్ట్రీయం

కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 8: హైదరాబాద్ నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కుప్పకూలటంతో కనీసం పదిమంది మరణించినట్లు సమాచారం. పలువురు క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఉండగా మిగతావారంతా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జంటనగరాల్లో అనుమతి లేని నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం మంత్రి మహేందర్‌రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న టోలిచౌకికి చెందిన సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ అనుమతి లేకుండా, గ్రామకంఠం పరిధిలో సుమారు 500 గజాల స్థలంలో ఏడంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. పై అంతస్థులో ఫ్లోరింగ్ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇదే భవనం పై అంతస్థులో నివాసం ఉంటున్న సుమారు ఆరు కుటుంబాలకు చెందిన కూలీలు, వారి కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్లు ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిలో 14మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా భవంతి కూలడంతో ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందన్న భయంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి పద్మారావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, నగర డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, జాయింట్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. జెసీబీలు, క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీంలు సహాయ చర్యలను చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం డబుల్ సెల్లార్‌ను నిర్మించటం వల్లనే భవనం బలహీనపడి కూలిపోయింది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే ఏడంతస్థుల భవనాన్ని నిర్మించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని అంతస్థులను నిర్మిస్తుంటే, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నిర్మాణంలో ఉన్న సాంకేతిక లోపాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

చిత్రం. నానక్‌రాం గూడలో కుప్పకూలిన భవనం