రాష్ట్రీయం

బాధ్యులను వదిలేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 9: నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని అభిప్రాయపడ్డారు. భవన యజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెప్పారు. అతని కొడుకు అనిల్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయతే, సత్తుసింగ్ ఓ మంత్రి బంధువుగా ఆరోపణలు వస్తున్నాయని, బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వర్తించని కారణంగా సర్కిల్ 11 (శేరిలింగంపల్లి) డిప్యూటీ కమిషనర్ మనోహర్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు సిటీ ప్లానర్ కృష్ణమోహన్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదిలావుంటే, భవనం కుప్పకూలిన దుర్ఘటనలో శుక్రవారం సాయంత్రానికి ఆరు మృతదేహాలను బయటకు తీశారు. సంఘటనా ప్రాంతంలో గురువారం రాత్రి ప్రారంభమైన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం నుంచి తల్లిబిడ్డ మృత్యుంజయులై బయటపడ్డారు. గాయాలపాలైన వీరికి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా తొమ్మిదిమంది ఉండొచ్చని స్థానికుల కథనం. భారీ శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారో లేదో తెలీని కూలీలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. శిధిలాల కింద ఉన్నవారు ప్రాణాలతో ఉండి ఉండొచ్చన్న ఆశతో ఆక్సిజన్ పంపుతున్నారు. ఏడాదిగా కొనసాగుతున్న భవన నిర్మాణ పనుల్లో పని చేస్తున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన శివ మృతి చెందగా, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అతని భార్య రేఖ, కుమారుడు దీపక్‌ను ప్రాణాలతో కాపాడారు. ఇంకా శిధిలాల కింద చిక్కుకున్న వారు విజయనగరం జిల్లా బల్దిపేట మండలంలోని చిలకపల్లి, సుభద్ర గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. వీరిలో భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేతి సాంబయ్య (38), అతని భార్య పైడమ్మ (35), కుమారై గౌరీశ్వరి (18), వెంకటలక్ష్మి (40), దుర్గారావు (22), శివ (30) మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఇద్దరు చత్తీస్‌గఢ్‌కు చెందిన టైల్స్ పనివారై ఉండొచ్చని స్థానికుల భావన. వీరిని గుర్తించేందుకు బంధువులు, తోటి పనివారిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ప్రమాదం సంభవించిన తరువాత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటం, ఇరుకు రోడ్లు కారణంగా సహాయక చర్యలు కష్టంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే మున్సిపల్ మంత్రి కె తారక రామరావు, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కరికి రూ. 10 లక్షలు, ఏపి ప్రభుత్వం రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి.
సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దురదృష్ట ఘటనలపై మరింత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి అధ్యయనం కోసం కమిషనర్ అధ్యక్షతన కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. గ్రామకంఠ స్థలాల్లో ఇలాంటి బహుళ అంతస్తులు నిర్మించకుండా నియంత్రించేందుకు జిహెచ్‌ఎంసి మరింత క్రీయాశీలక చర్యలు చేపట్టాలని, వాటిపై అధ్యయనానికి మున్సిపల్ కార్యదర్శి నవీన్‌మిట్టల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇప్పటివరకు 1800 పైచిలుకు నాలాల ఆక్రమణల కూల్చివేశామని, అందులో నివాసముంటున్న వెయ్యిమందిని బయటకు తీసుకొచ్చామని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎంత క్రీయాశీలంగా వ్యవహారించినా, కొందరి దురాశ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా, కిందిస్థాయిలో అవినీతి జరగకుండా ప్రజలూ సహకరించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి పునరావాస చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
యజమాని నుంచీ పరిహారం..
ఘటనా స్థలాన్ని తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు సర్కారు అందిస్తున్న పరిహారంతోపాటు యజమాని నుంచీ మరో పది లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వెయ్యి గజాల్లో నిర్మించాల్సిన ఏడు అంతస్తుల భవనాన్ని కేవలం 200 గజాల్లో ఎలా నిర్మిస్తారని, జిహెచ్‌ఎంసి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బిల్డర్, ఇంజనీర్, యజమానితోపాటు జిహెచ్‌ఎంసి అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ స్కీం ఆయుధంగా అనేక రకాలుగా అవినీతి జరుగుతోందని చంద్రకుమార్ ఆరోపించారు.

చిత్రం..బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న మున్సిపల్ మంత్రి కె తారక రామారావు