రాష్ట్రీయం

కరెన్సీ లేక జనం ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: వరుసగా బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు. రెండవ శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్ ఉన్ నబీ బ్యాంకులకు సెలవు. దీంతో పరిస్థితి మరింత దిగజారనుంది. ఎటిఎంలలో నగదు లేక, బ్యాంకుల్లో డబ్బు లేక జనం కటకటలాడిపోతున్నారు.
వారానికి 24వేల రూపాయలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా బ్యాంకులు మాత్రం నాలుగైదు వేలకు మించి ఇవ్వడం లేదు. ఎంత పెద్ద బ్రాంచికి అయినా నాలుగైదు లక్షల రూపాయలకు మించి రావడం లేదు. దాంతో బ్యాంకులు ఒక్కొక్కరికి నాలుగు వేలకు మించి ఇవ్వడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడిన తరువాత కూడా కనీసం నాలుగువేల రూపాయలైనా దక్కుతాయనే నమ్మకం కలగడం లేదు. క్రమంగా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఒకవైపు బడా బాబుల వద్ద వందల కోట్ల రూపాయలు పట్టుపడితే, తమకు బ్యాంకులు రెండువేల రూపాయలు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకులపై ఆగ్రహం చూపిస్తున్నారు. అనేక చోట్ల ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. నగదు వ్యవహారాలతోనే వ్యాపారాలు అన్నీ నెల రోజుల కరెన్సీ రద్దులో కొట్టుకు పోయాయి. నోట్ల రద్దు వల్ల తమకేమీ కాదని, పెద్ద వాళ్లకే నష్టం అని తొలుత చాలా మంది భావించారు. కానీ క్రమంగా కష్టాలు ఎదురు కావడంతో అసహనం పెరిగిపోతోంది. పాత నగరంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఏవో కొద్దిపాటి బ్యాంకుల్లో డబ్బులు ఉంటున్నాయి. ఆ బ్యాంకుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల పని దినాలు ఉదయం పది గంటలకు ప్రారంభం అయితే, ఖాతాదారులు మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచే క్యూ కడుతున్నారు. హైదరాబాద్ టోలీచౌకీ ఎస్‌బిఐ ముందు వందల సంఖ్యలో ఖాతాదారులు శుక్రవారం క్యూలో నిలబడ్డారు. గంటల తరబడి నిలబడ్డ తరువాత డబ్బులు లేవని బ్యాంకు అధికారులు చెప్పడంతో వారి కోపం కట్టలు తెంచుకుంది.
టోలీ చౌకీ రోడ్డుపై బైఠాయించి బ్యాంకుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది. నాలుగు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై బైఠాయించిన వారిపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జీతో ఆగ్రహం చెందిన ప్రజలు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పారు. దాంతో ప్రజలు తిరిగి క్యూలో నిలబడ్డారు. నెల రోజులు అవుతున్నా పాత బస్తీలో ఎటిఎంలు పని చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో సైతం పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పటి వరకు ప్రజలు పరిస్థితి మారుతుందని ఎదురు చూశారు. ఇలానే ఉంటే పరిస్థితి చేయి దాటి పోతుందని బ్యాంకు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌బిఐ పంపించిన మేరకే కరెన్సీ ఇవ్వగలమని, ఇంతకు మించి తామేం చేయలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులకు, ఖాతాదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎటిఎంలు అసలు పని చేయడం లేదు. బ్యాంకుల వద్ద డబ్బులు లేవు. నోట్ల రద్దు ప్రకటించి నెల రోజులు గడిచిపోయిన తరువాత కూడా పరిస్థితి మారకపోవడం విశేషం.