తెలంగాణ

భూసేకరణ బిల్లుకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టపరమైన చిక్కులకు ఇక చెక్ ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుపై ఉప సంఘం
నగదురహిత కార్యకలాపాలపైనా సబ్ కమిటీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు
పనిభారం లేని శాఖల నుంచి సిబ్బందికి కదలిక ఇతర శాఖల్లో సర్దుబాటుకు యోచన
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇబ్రహీంపూర్‌కు ప్రధాని ప్రశంస: కెసిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 10: కొత్త భూసేకరణ బిల్లుకు తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింపి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఈనెల 16నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భూసేకరణ బిల్లు ప్రవేశపెడతారు. జీవో 123 ప్రకారం భూసేకరణ జరిపితే పలువురు నిర్వాసితులు కోర్టులను ఆశ్రయించారు. జీవో 123 భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూ సేకరణకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భూసేకరణకు చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా కొత్త బిల్లు రూపొందించారు. రాష్ట్రంలో ప్రయివేట్ వర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నగదురహిత కార్యకలాపాలు పెంచేందుకు ఐటి మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నాం మూడున్నరకు కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. దాదాపు మూడు గంటలపాటు క్యాబినెట్ సమావేశం నిరంతరం సాగినా, 16నుంచి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ వెలువడినందున సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించలేదు. అయితే, భేటీలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
ప్రయివేట్ వర్శిటీలు
రాష్ట్రంలో ప్రయివేట్ వర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయివేట్ వర్శిటీల ఏర్పాటుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో కెటిఆర్, పోచారం, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ కమిటీకి సలహాదారుగా వ్యవహరిస్తారు.
నగదురహిత కమిటీకి కెటిఆర్
ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజ్ చేసే యోచనతో ఐటి మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని వేశారు. సబ్ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు. టి-వాలెట్ రూపకల్పనపై కమిటీ సలహాలిస్తుంది.
పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, ఆదాయం పెంపునకు నగదురహిత కార్యకలాపాలను వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి జరిగే అన్ని చెల్లింపులు, ప్రభుత్వానికి వచ్చే రాబడి, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
ఆర్టీసిలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, బస్సు టికెట్లను ఆన్‌లైన్‌లో ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. కరెన్సీ కష్టాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు నగదురహిత కార్యకలాపాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలని కేబినెట్ భేటీలో సిఎం కెసిఆర్ మంత్రులకు సూచించారు. సిద్దిపేట నియోజక వర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదురహిత గ్రామంగా మార్చిన తీరును సమావేశంలో చర్చించారు. సిద్దిపేటలో అమలు జరుగుతున్న ఈ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారని మంత్రులకు సిఎం కెసిఆర్ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా నగదురహిత కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని సిఎం తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.
కొన్ని శాఖల్లో పనిభారం ఎక్కువగా ఉందని, అదే సమయంలో కొన్ని శాఖల్లో అసలు పనిలేకుండా ఉద్యోగులు ఖాళీగా ఉన్నారని కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పనిభారం లేని శాఖలకు సంబంధించిన ఉద్యోగులను, సిబ్బంది అవసరమున్న ఇతర శాఖలకు మార్చాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్ర నగర్‌లోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పేరును పివి నరసింహారావు వర్శిటీగా గతంలో మార్చారు. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు కలిగే నష్టం గురించి సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదన బలంగా వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక అమలుకు ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

చిత్రం... కేబినెట్ భేటీ నుంచి బయటకు
వస్తున్న మంత్రులు కెటిఆర్ తదితరులు