రాష్ట్రీయం

ఉగ్రభూతంపై భిన్నస్వరాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, డిసెంబర్ 11: భారతీయ పౌర సమాజంలో మార్పు వచ్చినప్పుడే సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యమవుతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల రసరంజని సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎంవిఆర్ కల్యాణ మండపం ఆవరణలో ఆదివారం సాయంత్రం ‘ఉగ్రవాదంపై రాజ్యం వైఖరి నాడు-నేడు’ అనే అంశంపై ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. రసరంజని వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల సంగమేశ్వరశాస్ర్తీ అధ్యక్షత వహించారు. పాకిస్తాన్ ప్రేరణతోనే ఉగ్రవాదం మనదేశంలో నాలుగు దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిందని ఆయన అన్నారు. 1947, 1965, 1971లలో భారత్‌తో జరిగిన యుద్ధాల్లో తోకముడిచిన పాకిస్తాన్, అపరిమిత ద్వేషంతో ఆగర్భశత్రువుగా మారి కవ్వింపులకు పాల్పడుతోందన్నారు. అద్భుతమైన పరాక్రమం చూపే సైన్యం, దమ్మున్న ప్రధాని మనకు ఉన్నప్పటికీ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం జరిపిన సర్జికల్ దాడులను రాజకీయ పార్టీలు, మేధావులు, చివరకు కొన్ని ప్రసార మాధ్యమాలు సైతం వక్రీకరించి విశే్లషించటమే ఇందుకు నిదర్శనమన్నారు. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై 2001లో దాడి జరిగిన అనంతరం అందుకు బాధ్యుడైన బిన్ లాడెన్‌ను వెంటాడి హతమార్చినప్పుడు అమెరికన్లు ముక్తకంఠంతో ప్రభుత్వానికి మద్దతు పలికారని, భారతీయ సమాజంలో అలాంటి పరిస్థితులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాల పట్ల అన్ని రాజకీయ పార్టీలు కలసిరావాలని, దేశ సమగ్రతకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పంజాబ్‌లో ఖలిస్తాన్, తమిళనాడులో ఈలం వంటి సంస్థలు దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. 2001లో భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా పార్లమెంట్‌పై జరిగిన దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లభ్యమైనప్పుడు ప్రజలు తీవ్రంగా స్పందించారన్నారు. అప్పటి ప్రధాని వాజపేయి, హోంమంత్రి అద్వానీ సైన్యం సెలవులను రద్దు చేయించి సరిహద్దులకు పంపినప్పటికీ, మూడు వారాలు తిరక్కుండానే బలగాలను వెనక్కు రప్పించటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 2008లో కరాచీ నుండి వచ్చిన ఉగ్రవాద ముష్కరులు ముంబయిపై విరుచుకుపడిన నేపథ్యంలో దేశం అట్టుడికిందని, అప్పుడు త్రివిధ దళాధిపతులు యుద్ధం అనివార్యమని నాటి యుపిఎ ప్రభుత్వానికి ప్రతిపాదించినా, కేంద్రం సానుకూలంగా స్పందించలేక పోయిందని ఎంవిఆర్ శాస్ర్తీ చెప్పారు. దేశంలో అశాంతిని, అలజడిని రేకెత్తిస్తున్న విదేశీ ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేస్తే పౌరహక్కులకు భంగం కలుగుతోందని, రాజ్యహింస పెచ్చరిల్లుతోందని గగ్గోలు పెట్టే కుహనా మేధావులు వాస్తవాలను ఆకళింపు చేసుకోవాలని హితవు పలికారు. దేశద్రోహులైన అఫ్జల్‌గురు, కసబ్‌లను ఉరితీస్తే రాజ్యం హత్యాకాండగా చిత్రీకరించటం అమానుషమన్నారు.
దేశంలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రాజకీయాలు పక్కనపెట్టి ప్రధానిని రాజ్యాధినేతగా గుర్తించాలని ఎంవిఆర్ శాస్ర్తీ కోరారు. కీలక సైనిక స్థావరాలైన పఠాన్‌కోట్, యూరి వంటి శత్రు దుర్భేద్యమైన ప్రాంతాల్లో కేవలం పాకిస్తాన్ అండదండలతోనే దాడులు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌తో యుద్ధానికి సన్నద్ధమై సర్జికల్ దాడులు జరిపిస్తే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీలు ఆయనను జోకర్‌గా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం హేయమన్నారు. తొలుత దేశ సరిహద్దుల్లో మృతి చెందిన భారతీయ సైనికుల స్మృత్యర్థం వౌనం పాటించారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ, అంబటి మురళీకృష్ణ, సినీ, రంగస్థల నటులు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు, సంస్కృతి బాలచందర్ తదితరులు హాజరయ్యారు.

చిత్రాలు.. ‘ఉగ్రవాదంపై రాజ్యం వైఖరి నాడు-నేడు’ అనే అంశంపై ఆదివారం రసరంజని సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ.