రాష్ట్రీయం

పేలుళ్లు.. వాళ్లపనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పనేనని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చేసింది. ఎన్‌ఐఏ జరిపిన పూర్తి దర్యాప్తు నివేదికను నిశితంగా పరిశీలించిన ప్రత్యేక కోర్టు ఈనెల 19న దోషులకు శిక్ష ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. 2013 ఫిబ్రవరి 21న, దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 22మంది మృతి చెందారు. 140మంది గాయపడిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనలో ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భక్తల్‌తోపాటు అసదుల్లా అక్తర్, తహసిన్ అక్తర్, జియాఉల్ రహ్మాన్ అలియాస్ వకాస్, షేక్ ఎజాజ్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో వకాస్ పాకిస్తాన్ జాతీయుడుకాగా మిగతావారు కర్నాటక, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. వీరిపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్థాల నేరం కింద ఎన్‌ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. వీరంతా చర్లపల్లి కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను పేలుళ్ల ప్రధాన కారణంగా నిర్ధారించిన కోర్టు, నిందితులకు శిక్షలు ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. ఇదిలావుండగా కేసులో ఆరుగురు నిందితుల్లో ఐదుగురు చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉండగా, పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 524మందిని ఎన్‌ఐఏ సాక్షులుగా చూపించగా, 157మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. 2013లో జరిగిన ఘటనలో ఎంతోమంది విగత జీవులుగా మారారని, కేసు గత ఏడాది ఆగస్టు 24న అండర్ ట్రయల్‌గా ప్రారంభమై, డిసెంబర్ 13న (మంగళవారం) జంట పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థే కారణంగా ఆరుగురిని దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. ఈనెల 19న నిందితులకు శిక్ష ఖరారుకానున్న నేపథ్యంలో నిందితులకు కఠిన శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నట్టు ఎన్‌ఐఏ డైరెక్టర్ శరద్‌కుమార్ తెలిపారు.
జైలువద్ద భారీ బందోబస్తు
జంట పేలుళ్ల కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం చర్లపల్లి జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులకు సంబంధించి వారి బంధువులు, సానుభూతిపరులపై నిఘా పెట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు జైలు ఎదుట ధర్నాకు దిగారు. పేలుళ్ల కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం నశించాలి.. ఉగ్రవాద ప్రేరేపిత దేశాలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో జైలు పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి చర్లపల్లి, కుషాయిగూడ ఠాణాలకు తరలించారు.

పేలుళ్ల అసలు సూత్రధారి, పరారీలోవున్న రియాజ్ భక్తల్. బాంబు పేలుళ్లతో
కకావికలమైన దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం (ఫైల్ ఫొటో).