రాష్ట్రీయం

సీనియర్ జర్నలిస్టు హనుమంతరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలుగు జర్నలిజంలో అందెవేసిన కలం అనిపించుకున్న వి హనుమంతరావు (91) మంగళవారం ఉదయం శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్)లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సతీష్‌బాబు కూడా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. 1925లో జన్మించిన హనుమంతరావు తొలుత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద లేఖకుడిగా పనిచేశారు. తర్వాత జర్నలిజంలోకి వచ్చారు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, కృష్ణాపత్రిక, ఈనాడు, ఎకనమిక్ టైమ్స్ తదితర దినపత్రికలతో పాటు జాతీయ వార్తా సంస్థ అయిన యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్‌ఐ) కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఎన్ వేణుగోపాల్ నేతృత్వంలో వెలువడుతున్న ‘వీక్షణం’ మాసపత్రికకు ఫౌండర్ ఎడిటర్‌గా పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రక తరఫున పార్లమెంట్‌లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ తరఫున వార్తలను కవర్ చేసి రికార్డు సృష్టించారు. పాకిస్తాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ నావలో బసచేసి యుద్ధ వార్తలను కవర్ చేశారు. 91 సంవత్సరాల హనుమంతరావు 65 ఏళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. జర్నలిజం పాఠశాలను కూడా స్థాపించారు. డేటా న్యూస్ ఫీచర్స్ (డిఎన్‌ఎఫ్) అనే వార్తా సంస్థను స్థాపించారు. కొనే్నళ్లపాటు శ్రమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని రంగాల వివరాలతో ‘ఇయర్‌బుక్’ను తెచ్చారు. కేవలం జర్నలిస్టుగానే కాకుండా హనుమంతరావు కొన్ని పుస్తకాలు రాశారు. ‘విమర్శ- పరామర్శ’ పేరిట రాసిన ఆత్మకథ 50 ఏళ్ల చరిత్రను మన కళ్లముందు ఆవిష్కరించింది. ఆర్థికాంశాలపై వివిధ పత్రికలకు వేలాది వ్యాసాలు రాశారు.
ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండగా, ఆంధ్ర ప్రొవిన్షియల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్సు స్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఏపీ ఏర్పాటు తర్వాత ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఎపియుడబ్యుజె జనరల్ సెక్రటరీగా పనిచేసిన హనుమంతరావు జర్నలిస్టుల యూనియన్‌తో చివరివరకు సత్సంబంధాలు కలిగి ఉన్నారు.
హనుమంతరావు మృతిపట్ల తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు సంతాపం తెలియచేశారు. విహెచ్‌ను ‘ఆదర్శ జర్నలిస్టు’గా అభవర్ణిస్తూ, ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటని నివాళి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విహెచ్ మృతికి సంతాపం తెలిపారు. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజెయు) సెక్రటరీ-జనరల్ దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జనరల్ సెక్రటరీ కె విరాహత్ అలీ తదితరులు విహెచ్‌కు నివాళి అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.