రాష్ట్రీయం

దేశం కోసం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: దేశ ప్రయోజనాల కోసం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం తీసుకున్న సదుద్దేశ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తలెత్తినా, సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రధాని విధించిన వ్యవధి వరకూ వేచిచూద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అనుకున్న లక్ష్యం నెరవేరక, కేంద్రం నిర్ణయం సాధారణ ప్రజలకు కంటకంగా మారితే తప్పకుండా వ్యతిరేకిస్తామని సిఎం కెసిఆర్ ఉద్ఘాటించారు. ప్రజలకే కాదు, నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్రాల ఆదాయ వనరులపై ప్రభావం చూపిందన్న విషయాన్ని ప్రధాని దృష్టికి స్వయంగా తీసుకెళ్లింది తానేనని కెసిఆర్ గుర్తు చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసాక నోట్ల రద్దుపై లఘు చర్చను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని నిర్మూలించటం ఒక్కటే కాకుండా నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం, రాజకీయ అవినీతిని రూపుమాపడం, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అరికట్టడం వంటి అంశాలు ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ కేంద్రానికి అండగా నిలవాల్సిందేనని సిఎం అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతుగా నిలవడానికి దేశ విస్తృత ప్రయోజనాలే తప్ప మరో కోణం ఏదీ లేదని స్పష్టం చేశారు. గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం కూడా నోట్ల రద్దు చేయాలని యోచించినప్పటికీ, నిర్ణయం తీసుకోలేకపోయిందంటే ఈ చర్యను ఎవరూ వ్యతిరేకించటం లేదనడానికి నిదర్శనమన్నారు. అయితే మార్పును ఎప్పుడూ అంత సులువుగా అంగీకరించరని, దాని ఫలాలు ప్రజలకు అందినప్పుడే మార్పులోని గొప్పతనం గుర్తిస్తారన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకెళ్లిందని, తాను స్వయంగా ప్రధానిని కలిసి వివరించడంతో పాటు, అధికార యంత్రాంగం వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాసిందని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి చిన్న నోట్లను విరివిగా రాష్ట్రానికి పంపించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరగా, రూ.19,109 కోట్ల విలువ చేసే నోట్లను పంపిందన్నారు. అయితే పంపించిన నోట్లలో 86 శాతం రూ. 2 వేల నోట్లు కావడం వల్లే చిల్లర కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిఎం వివరించారు. రద్దు చేసిన నోట్లను స్థానిక సంస్థల పన్నులు, బిల్లులు చెల్లించేందుకు అనుమతించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్ చేసిన సూచిన మేరకే దేశవ్యాప్తంగా వర్తింప చేసిందని సిఎం గుర్తు చేశారు. నోట్ల రద్దు అంశం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశమే కావడంతో రాష్ట్రాలు అనుసరించాల్సిందే తప్ప మరో మార్గం లేదన్నారు. తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి మేలు జరుగుతున్నప్పుడు ప్రజలూ తమ కర్తవ్యంగా కేంద్రానికి అండగా నిలువాల్సిందేనని సిఎం పిలుపునిచ్చారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాల ఆదాయంపై చూపే ప్రభావం, నష్టాన్ని తగ్గించడానికి స్వచ్చంద ఆదాయ వెల్లడి ద్వారా కేంద్రానికి వచ్చిన రూ. 27 వేల కోట్లను రాష్ట్రాలకు కేటాయించాలని కూడా ప్రధానిని కోరినట్టు ముఖ్యమంత్రి వివరించారు.
పెద్ద నోట్లను రద్దు చేయడం వినా మరే నిర్ణయాన్ని కేంద్రం తీసుకోకపోయినప్పటికీ కొందరు ప్రజలలో భయోత్పతానికి గురి చేసే విధంగా వదంతులు వ్యాపింప చేస్తున్నారని, మహిళల ఒంటిపై ఉన్న బంగారు నగలనూ లాక్కుంటుందని అపోహలు సృష్టించి వదంతులను వ్యాపింపచేస్తున్నారని సిఎం అన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఏవేం చర్యలు తీసుకోబోతుందో ప్రధాని స్వయంగా తనకు చెప్పారని, అన్ని విషయాలను బయటికి చెప్పలేమన్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజమని, నల్లధనం బంగారు కడ్టీలు, బిస్కెట్లు, వజ్రాల రూపంలో ఉంటే తప్పకుండా లాక్కుంటుంది, అంతేతప్ప ఒంటిపై ఉన్న నగలను లాక్కుంటారనే ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

చిత్రం..అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుపై చర్చలో ప్రారంభోపన్యాసం చేస్తున్న సిఎం కెసిఆర్