రాష్ట్రీయం

ప్రగతి బాటలేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: దేశవ్యాప్తంగా 14 ఎక్స్‌ప్రెస్ హైవేలు, 36 రింగ్‌రోడ్లు నిర్మించే యోచన ఉన్నట్టు ఉపరితల రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు శనివారంనాటి కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. 11 నదుల్లో జల రవాణాకు గంగానదిపై 40 వాటర్ పోర్టులు నిర్మించాలన్న యోచనలో కేంద్రం ఉందని వివరించారు. ఢిల్లీలో 3వేల కోట్ల వ్యయంతో రెండు బైపాస్‌లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు నివారించనున్నామని, తెలంగాణలో 8 వేల కోట్లతో ఐదు రోడ్డు ప్రాజెక్టులు చేపడతామని వెల్లడించారు. దేశంలో బహుళ నమూనా రవాణా హబ్‌లు చేపడతామని, జలమార్గాలు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదార్ల పరిధిలోకి 2 లక్షల కిలోమీటర్ల రోడ్లను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎంతో వేగంగా పనిచేస్తున్నా భూసేకరణ, పర్యావరణ సమస్యలతో 3.75 లక్షల కోట్ల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పునరుద్ధరిస్తున్నట్టు వివరించారు. ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో లక్షన్నర మంది మరణిస్తున్నారని నితిన్ గడ్కారీ వివరించారు. రోడ్లను వెడల్పు చేసి నిర్వహించడమేగాక, ఇరువైపులా పరిశుభ్రం చేయాలని, మొక్కలునాటి హరిత వనాలు పెంచాలని సూచించారు. యుఎస్‌లోని లాస్ ఏంజెల్స్ -శాన్ ఫ్రాన్సిస్‌కో మధ్య ఉన్న రోడ్డు మాదిరి ముంబై -గోవా రహదారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సముద్ర తీరంలోని రెండు నగరాల మధ్య మంచి రోడ్లు, సుందరవనాలు, పర్యాటక ప్రాంతాలుగా మారి, అందర్నీ ఆకర్షిస్తున్నాయని, తద్వారా జిడిపి పెరుగుతుందని పేర్కొన్నారు. సహజసిద్ధమైన ప్రకృతి ప్రదేశాలనే కాదు, మనం కూడా అందమైన ప్రదేశాలను తీర్చిదిద్దవచ్చని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ముంబై -గోవా రోడ్డు అభివృద్ధిపై నివేదిక కోరామని తెలిపారు. దేశంలో 2200 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని, మరో 35వేల కిలోమీటర్ల రహదార్లు కూడా జాతీయ రహదార్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి 3.75 లక్షల కోట్లు విలువైన 403 రోడ్డు ప్రాజెక్టులు పర్యావరణ కారణాలతో, భూసేకరణ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయని, వాటిని తాము పరిష్కరించి పనులు చేపట్టామని తెలిపారు.
డిపిఆర్‌లు తయారు చేసే సంస్థలు తమ నివేదికలను ఖచ్చితమైన అంచనాలతో తయారుచేయాలని, ఆయా నివేదికలు సత్వరం తయారుచేసి శాఖాపరమైన అనుమతులు పొందాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో వ్యర్థపదార్ధాలు, ప్లాస్టిక్, మైనింగ్, కర్బన వ్యర్ధాల వినియోగం ఉండేలా చూడాలని సూచించారు. తక్కువ ఖర్చు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించాలని గడ్కరీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు
జగిత్యాల -కరీంనగర్- వరంగల్ సెక్షన్‌లో 130 కిలోమీటర్ల దూరం 2500 కోట్లతో, సూర్యాపేట- ఖమ్మం సెక్షన్ కొత్త హైవే 60 కిలోమీటర్ల రోడ్డు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తారు. సంగారెడ్డి- నాందేడ్- అకోలా సెక్షన్ హైవేను 140 కిలోమీటర్లు పొడవున 2300 కోట్లతో, 90 కిలోమీటర్లు పొడవైన మంచిర్యాల -చంద్రాపూర్ రోడ్డును 1500 కోట్ల వ్యయంతో, కోదాడ- ఖమ్మం సెక్షన్ 40 కిలోమీటర్లు రోడ్డును 700 కోట్లతో అభివృద్ధి చేస్తారు.
సమావేశంలో తెలంగాణ రహదారులు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బిబి పాటిల్, కె ప్రభాకర్‌రెడ్డి, ఐఆర్‌సి చైర్మన్ ఎస్‌ఎస్ పొర్వాల్, ఐఆర్‌సి సెక్రటరీ జనరల్ ఎస్‌ఎస్ నాహర్, ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఇంజనీర్ ఇన్ చీఫ్ బిక్షపతి, గణపతిరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు మహేందర్, చంద్రశేఖరరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రోడ్డు కాంగ్రెస్ సావినీర్ ఆవిష్కరించారు. శాఖాపరమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన వారికి ప్రత్యేక మెమెంటోలు, సర్ట్ఫికేట్లు బహూకరించారు.

చిత్రం..హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ