రాష్ట్రీయం

త్యాగధనుల బాటలో నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: భారతదేశం అభివృద్ధికోసం పాటుపడుతున్న త్యాగధనులను ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో పయనించాలని తెలంగాణ, ఎపి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టివోలి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్స్-2016’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 23 సంవత్సరాల క్రితం ప్రారంభించిన శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులను ఈ సంవత్సరం డాక్టర్ ఇ.శ్రీధరన్ (మెట్రో శ్రీధరన్), డాక్టర్ సి.రంగరాజన్‌లకు అందజేశారు. అవార్డు కింద రూ. లక్ష నగదు, శాలువా, మెమెంటో అందించారు. శ్రీధరన్ స్వయంగా అవార్డు అందుకోగా, రంగరాజన్ తరఫున ఆయన కూతురు రాధ ఈ అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న వారిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. భారత్‌కు చెందిన కొంతమంది ప్రముఖులు పశ్చిమ దేశాలవైపు దృష్టి సారించగా, మరికొందరు భారతదేశం అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, అలాంటి వారిలో రంగరాజన్, శ్రీధరన్‌లను ప్రధానంగా పేర్కొనవచ్చన్నారు. ఈ ఇద్దరూ భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారన్నారు. దేశసమగ్రతను కాపాడేందుకు ఉన్నత విలువలతో పనిచేశారన్నారు. రంగరాజన్ ఆర్థిక రంగంలో, శ్రీధరన్ ఇంజనీరింగ్ రంగంలో ఆణిముత్యాలన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలను కాపాడుతూ, దేశాన్ని ముందుకు నడిపేందుకు రంగరాజన్, శ్రీధరన్ తమవంతు కృషి చేశారన్నారు.
అవార్డు స్వీకరించిన శ్రీధరన్ మాట్లాడుతూ శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు రావడం ఆనందంగా ఉందని, ఇది తనకు వచ్చిన అవార్డుల్లో 89వదని తెలిపారు. తనకు లభించిన నగదు అవార్డును తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టుకు ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ మెట్రోలో తాను ఉద్యోగం చేసిన సమయంలో లభించిన వేతనంతో పాటు తనకు లభిస్తున్న పింఛనును కూడా ఈ ట్రస్టు ద్వారా పేద పిల్లల చదువుకోసం వాడుతున్నామన్నారు. ప్రతి వ్యక్తి జాతీయ సమగ్రత, సమయపాలన, నైపుణ్యత, సమాజం పట్ల నిబద్ధతతో పనిచేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ మెట్రో, కొంకణ్ రైల్వేలను నిర్ణీత సమయంలో, ముందుగా రూపొందించిన బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పూర్తిచేశానని గుర్తుచేశారు. రంగరాజన్ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆయన తరఫున అవార్డును తాను అందుకున్నానని రంగరాజన్ కూతురు రాధా రంగరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ, దేశం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారికి ఏటా అవార్డులను ఇస్తున్నామని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టీ ప్రొఫెసర్ రాఘవేంద్ర తెలిపారు. 23 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 117 మందికి ఈ అవార్డులను ఇచ్చామన్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు శివగంగ సంగీత పరిషత్తు, మహాలక్ష్మి టెంపుల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, శివానంద కల్చరల్ ట్రస్ట్ నడుస్తున్నాయని ట్రస్టీ కె.బసవరాజు వివరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానిస్తున్నామన్నారు. బెంగళూరులోని కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చైర్మన్ డాక్టర్ పి.రామారావు, ఐఎఎస్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం తదితరులు కూడా మాట్లాడారు. కుమారి రమ్యశ్రీ, శ్రీమతి తేజస్విని అనంత్ నేతృత్వంలో సంగీత విభావరి జరిగింది.

శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డును శ్రీధరన్‌కు
ప్రదానం చేస్తున్న గవర్నర్ నరసింహన్