రాష్ట్రీయం

భద్రాద్రికి ముక్కోటి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 29: శ్రీరామ దివ్యక్షేత్రం ముక్కోటి శోభను సంతరించుకుంది. నేటి నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా రామయ్య దశావతారాల్లో భక్తులను సాక్షాత్కరించనున్నారు. ముందుగా 30న మత్స్య, 31న కూర్మ, జనవరి 1న వరాహ, 2న నృసింహ, 3న వామన, 4న పరశురామ, 5న శ్రీరామ, 6న బలరామ, 7న శ్రీకృష్ణ, జనవరి 16న కల్కి అవతారాల్లో స్వామి దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 8న శ్రీ సీతారామచంద్రస్వామికి పవిత్ర గోదావరిలో హంస వాహనంపై తెప్పోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు జనవరి 9న తెల్లవారుఝామున వైకుంఠ రాముడికి ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామి జేగంటల, భక్తుల జయజయధ్వానాల నడుమ ఉత్తర ద్వారంలో దర్శనం ఇవ్వనున్నారు.
జనవరి 9వ తేదీ నుంచే స్వామికి రాపత్ ఉత్సవాలు సాయంత్రం వేళ ఘనంగా నిర్వహించనున్నారు. తొలుత జనవరి 9న డిఎస్పీ బంగ్లాలో, 10న అంబసత్రం, 11న గోదావరి వంతెన సమీపంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో, 12న తాతగారి గుడి గోవిందరాజస్వామి ఆలయంలో, 13న పునర్వసు మండపంలో, 14న దమ్మక్క మండపం పురుషోత్తపట్నంలో, 15న వన విహార మండపం వేస్ట్‌ల్యాండ్‌లో, 16న విశ్రాంతి మండపంలో, 17న శ్రీకృష్ణ దేవాలయంలో, 18న నమ్మళ్వార్ పరమపదోత్సవం, 19న నృసింహదాస మండపం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాపత్ ఉత్సవాలు జరుగుతాయి. వీటితో స్వామి అధ్యయనోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. జనవరి 20 నుంచి విలాసోత్సవాలు ప్రారంభమవుతాయి. 20న శ్రీ రామదాస మండపం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో, 21న దసరా మండపంలో, 22న వశిష్ట మండపంలో దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో స్వామికి విలాసోత్సవాలు జరుగుతాయి. జనవరి 11న కూడారై పాశురోత్సవం, 24న విశ్వరూప సేవ జరుగుతుంది.

చిత్రం..ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి