రాష్ట్రీయం

11వరకు అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: అసెంబ్లీ సమావేశాలను జనవరి 11 వరకు పొడిగిస్తూ శుక్రవారం జరిగిన బిఏసి సమావేశంలో నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ బిఏసి సమావేశం నిర్వహించారు. ఈమేరకు జనవరి 7, 8 తేదీలు వినా 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ మధుసూధనాచారి, సిఎం కెసిఆర్, శాసన సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపి, తెదేపా, సిపిఎం శాసన సభాపక్షం నాయకులు బిఏసి సమావేశానికి హాజరయ్యారు. సమావేశాలను జనవరి 11 వరకు పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 15న జరిగిన బిఏసిలో 30వరకు అజెండా ఖరారు చేశారు. అనంతరం బిఏసి సమావేశం నిర్వహించి సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, జనవరి మొదటి వారం వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని 15న జరిగిన బిఏసి సమావేశంలోనే ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి డిమాండ్ చేశారు. మొదటి వారం వరకు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తే, విపక్షాలు ఊహించని విధంగా రెండోవారం కూడా సమావేశాలు నిర్వహించేందుకు సిఎం సుముఖత వ్యక్తం చేశారు. జనవరి 3 వరకూ అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు. బిఏసి సమావేశంలో కాంగ్రెస్ తరఫున జానారెడ్డి, భట్టివిక్రమార్క, తెదేపా తరఫున సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్, బిజెపి తరఫున జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అధికారపక్షం తరఫున మంత్రులు హరీశ్‌రావు, ఈటల హాజరయ్యారు. దళితుల భూ పంపిణీ, కేజీ టూ పీజి ఉచిత విద్య, సింగరేణి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మైనారిటీల సంక్షేమంపై సమావేశాల్లో లఘు చర్చ జరిగింది.
ఇదిలావుంటే, కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఒకవేళ అవకాశం వచ్చి మాట్లాడితే, మధ్యలో మంత్రులు అడ్డుకుంటున్నా వారించడం లేదన్నారు. సభలో అన్ని పక్షాలకు అవకాశం ఉండాలని, సంఖ్యాబలం ఉందని అధికార పక్షం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో? ప్రతిపక్షానికీ అంతే ఉంటుందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యురాలు డికె అరుణ మీడియాతో మాట్లాడుతూ మంత్రులే గంటల తరబడి మాట్లాడుతున్నారని తమకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ 12 గంటలు, తెరాస 9 గంటలు
సభలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణ అర్థం లేనిదని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బిఏసి సమావేశం అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో 12 గంటల 36 నిమిషాల సమయాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటే, తెరాస కేవలం తొమ్మిది గంటల సమయం ఉపయోగించుకుందని అన్నారు. విపక్షానికి మాట్లాడే సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ సభ నుంచి పారిపోయిందని విమర్శించారు. కరెన్సీ రద్దు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి సభలో చర్చించాలని కాంగ్రెస్ కోరిందని, కాంగ్రెస్ కోరినట్టే చర్చించామన్నారు. అన్ని అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే సమాధానం చెప్పిందన్నారు. విపక్షాలు ఒకటి అడిగితే ప్రభుత్వం పది చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. సభలో లేవనెత్తేందుకు విపక్షానికి అసలు సమస్యలే లేవన్నారు. అసెంబ్లీ సమావేశాలు జనవరి రెండోవారం వరకు పొడిగిస్తున్నట్టు బిఏసిలో ముఖ్యమంత్రి చెప్పగానే కాంగ్రెస్ నేతలు తెల్లమొఖం వేశారని ఎద్దేవా చేశారు. సభ సజావుగా సాగడం ఇదే ప్రథమమని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని విపక్షం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. జనవరి 3నుంచి జరిగే సమావేశాల్లోనైనా కాంగ్రెస్ హూందాగా వ్యవహరించాలని కోరుతున్నట్టు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

చిత్రం..బిఏసి సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, సిఎం కెసిఆర్, వివిధ రాజకీయ పక్షాల నేతలు