రాష్ట్రీయం

ఆరోగ్యశ్రీకి రూ.484 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కి రూ.484.38లక్షల రూపాయలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా జివో జారీ చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ సెంటర్‌కు ప్రతిరోజు రెండు వందల మంది ఓపి సేవల కోసం వస్తున్నారు. ఆరోగ్యశ్రీపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఆరోగ్య వర్శిటీ విసిగా కరుణాకర్‌రెడ్డి
పదవిలో మూడేళ్లు ఉత్తర్వులు జారీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం (కెఎన్‌ఆర్ యుహెచ్‌ఎస్) ఉపకులపతిగా డాక్టర్ బి. కరుణాకర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరుణాకర్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీరకించిన సమయం నుండి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఐఏఎల్ కార్యదర్శిగా ప్రభాకర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 31: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఏల్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఐఏఎల్ జాతీయ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఐఏఏల్ జాతీయ ఎమిరెటస్ అధ్యక్షుడిగా జితేంద్రశర్మ, అధ్యక్షులుగా సుప్రీం కోర్టు న్యాయవాది ఆర్‌ఎస్ చీమ, ప్రధాన కార్యదర్శులుగా బొమ్మగాని ప్రభాకర్, మురళీధర్, లోహిత్‌లను ఎనున్నకున్నారు. ఉపాధ్యక్షులుగా జస్టిస్ సంఘ్వీ, జస్టిస్ అగర్వాల్, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజేంద్ర సచార్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పిపి రావు, కె వేణుగోపాల్, సరబ్‌జిత్ సింగ్, జికె భన్సాల్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకం, కార్మిక చట్టాల సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థ నైతికతలపై ప్రత్యేక కమిషన్లలో చర్చించి మహాసభ తీర్మానాలు చేసింది. న్యాయవాదుల సంక్షేమం కోసం తగు నిధులు కేటాయించడం, అలాగే ప్రజల సంక్షేమం కోసం కోర్టులలో వసతులు ఏర్పాటు, సుప్రీం కోర్టు, హైకోర్టులతో సహా దేశంలో పెండింగ్‌లో ఉన్న న్యాయమూర్తుల నియామకం, తగు సిబ్బందిని నియమించాలని ఐఎఏల్ జాతీయ మహసభలు డిమాండ్ చేశాయి.

బాణసంచా కేంద్రంలో పేలుడు

నెల్లూరులో ప్రమాదం ఇద్దరు సజీవ దహనం 14మంది పరిస్థితి విషమం

ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 31: నెల్లూరు నగర శివార్లలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో ఆ సమయంలో కేంద్రంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు శివార్లలోని పొర్లుకట్ట ప్రాంతంలో భాస్కర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. నగరానికి దూరంగా, పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉండడంతో ఈ కేంద్రం నిర్వహణపై అధికారులు నిఘా ఉంచలేకపోయారు. కేవలం 400 చదరపు అడుగులు కూడా లేని ఒక పూరికప్పు ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్నాడు.
శనివారం ఉదయం బాణసంచా తయారు చేసే కార్మికులు ఉదయం 8 గంటల నుంచే తమ పనిలో నిమగ్నమయ్యారు. కొత్త సంవత్సర వేడుకలకు ఆర్డర్లు ఎక్కువగా ఉండడంతో రోజువారీ కంటే మరింత ఎక్కువ మంది కార్మికులను పనిలో పెట్టుకొని యజమాని పనులు చేయించసాగాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో బాణసంచా తయారు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ తయారీ కేంద్రంలో భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో యాటగిరి నాగరాజు (32), లక్ష్మయ్య (35)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో 13 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. సమీపంలో ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వారి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాద ఘటన తెలియడంతో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అదనపు ఎస్పీ శరత్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించి అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నారాయణ ఆసుపత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పరామర్శించారు. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాణసంచా తయారీ కేంద్ర నిర్వాహకుడు భాస్కర్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి నెల్లూరు 3వ నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.