రాష్ట్రీయం

ఏపిలోని భద్రాద్రి భూముల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: భద్రాచలం ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉన్న 1048 ఎకరాలను వేలం పాటల ద్వారా విక్రయించి ఆ డబ్బులను ఆలయ అభివృద్ధికి ఖర్చు పెడుతామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్ష సభ్యుడు జలగం వెంకట్రావ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, భద్రాచలం ఆలయానికి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం వల్ల ఆలయాభివృద్ధికి చేపట్టిన పనులు ఆగిపోయాయన్నారు. భద్రాచలం ఆలయం మినహా చుట్టు పక్కలున్న ఏడు మండలాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లాయన్నారు. గతంలో థీమ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలం కోసం అనే్వషిస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీసీతారాముల స్వామి కళ్యాణం నిర్వహణకు శాశ్వత మండపాన్ని నిర్మించాలని జలగం వెంకట్రావ్ చేసిన సూచనను మంత్రి ప్రస్తావిస్తూ శ్రీసీతారాములవారి తాటి ఆకుల మండపంలోనే నిర్వహించడం ఆనాదిగా వస్తున్న ఆచారం కావడం వల్ల శాశ్వత మండపం నిర్మించడం లేదని మంత్రి చెప్పారు.
పర్ణశాల వద్ద థీమ్ పార్క్ నిర్మించడానికి తగినంత స్థలం అందుబాటులో ఉందని సభ్యుడు జలగం వెంకట్రావ్ గుర్తు చేయడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. అంబ సత్రం నిర్వహణను తాము చేయలేమని శృంగేరి పీఠం స్పష్టం చేసిందని, దీనినిర్వహణ బాధ్యతను ఆలయానికే అప్పగించాలని యోచిస్తున్నట్టు మంత్రి చెప్పారు. బిజెపి శాసనసభా పక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అయోధ్య తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాచల ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని, అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి సూచించారు. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న భూములను విక్రయించి ఆ నిధులను ఆలయాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. తిరుమల తిరుపతి దేవాస్థానానికి సంబంధించిన భూములు తెలంగాణలో, భద్రాచలం ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో ఇరు రాష్ట్రాలు పరస్పరం అవగాహనతో భూముల వేలంపై నిర్ణయం తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ భద్రాచలం ఆలయాభివృద్ధికి వంద కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.
భద్రాచలం చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే పురుషోత్తమపట్నం, కన్నాయగూడెం మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని సున్నం రాజయ్య సూచించారు. టిడిపి సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాచలం ఆలయంలో సీతమ్మ మంగళ సూత్రం, రాములవారి గొలుసు చోరి జరిగినట్టు ఆలయ అధికారులు ప్రకటించారని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగానే చోరీ జరగలేదని అదే అధికారులు ప్రకటన చేశారన్నారు. పోయిన నగలు ఎలా దొరికాయి? విచారణ జరిగిందా? జరిపితే ఆ నివేదికను బయట పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నగలు కనిపించలేదని, అయితే ఆ తర్వాత కనిపించినట్టు చెప్పారన్నారు. అయినప్పటికీ అనుమానితులపై శాఖపరమైన చర్య తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.