ఆంధ్రప్రదేశ్‌

ప్రజాప్రతినిధులు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 4: జన్మభూమి - మా ఊరు గ్రామ సభల్లో ప్రజా ప్రతినిధుల హాజరు 50 శాతం మాత్రమే ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి జన్మభూమి - మా ఊరు కార్యక్రమంపై అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిడిఓలతో సిఎం టెలికాన్ఫరెన్సు బుధవారం నిర్వహించారు. సిఎం మాట్లాడుతూ గత రెండు రోజుల్లో ప్రజాప్రతినిధుల హాజరు తక్కువగా ఉందన్నారు. జన్మభూమి గ్రామ సభల్లో ప్రజాప్రతినిధుల హాజరు 100 శాతం ఉండాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉంటేనే చర్చ అర్ధవంతంగా ఉంటుందని, సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరెవరు, ఎక్కడెక్కడ హాజరైందీ అన్న నివేదిక ప్రతిరోజూ తనకు పంపాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ఐవిఆర్ సర్వే నిర్వహిస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రతిగ్రామంలో 80 శాతం మేర సంతృప్తి నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రతినిధులు స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు హాజరై గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులను క్రోడీకరించాలని సూచించారు. కాల్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ సభల్లో అభిప్రాయాలు చెప్పాలే కాని గొడవలు పడరాదని విజ్ఞప్తి చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆటంకాలు కలిగిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సిఎఎస్ టక్కర్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వెంకట్రావు, పంచాయతీరాజ్, పౌర సరఫరాశాఖ కమిషనర్లు రామాంజనేయులు, రాజశేఖర్, పాల్గొన్నారు.

జిలెటిన్ స్టిక్స్ కలకలం!
కొత్తచెరువు, జనవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపధ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్ లభ్యం కావడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి కదలికలపై మావోలు రెక్కీ నిర్వాహించారన్న వార్తల నేపధ్యంలో జిలెటిన్ స్టిక్స్ పెద్దమొత్తంలో లభించడం సంచలనం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అనంతపురం జిల్లా బుక్కపట్నంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. అంతకుముందే ప్రత్యేక పోలీసులు, బాంబ్‌స్వ్వాడ్ బృందం పుట్టపర్తి-బుక్కపట్నం రోడ్డు మార్గంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తచెరువు-మామిళ్ళకుంట మధ్య 35-4 కల్వర్టు వద్ద జిలెటిన్ స్టిక్స్ లభించాయి. గోనెసంచిలో ఉన్న వీటిని బాంబ్‌స్క్వాడ్ బృందం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. కాలం చెల్లినవి కావడంతో వీటిని ఇక్కడ పారేసినట్లు తెలుస్తోంది. కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో బండరాళ్లు పగులగొట్టడానికి జిలెటిన్ స్టిక్స్‌ను వాడినట్లు సమాచారం.

23 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 4: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలనే డిమాండ్‌పై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద అగ్రిగోల్డ్ బాధితుల సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడలో బుధవారం జరిగిన సంఘ సమావేశంలో అనుకున్న నిర్ణయాలను గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. 3వ తేదీన హైకోర్టులో జరిగిన వేలం ప్రక్రియను 32 లక్షల మంది బాధితుల సమస్యను మానవతా ధృక్పథంతో ఆలోచించిన న్యాయమూర్తి వేలంలో ఆస్తుల యొక్క ధరలు పెంచడం పట్ల అభినందనలు తెలుపుతున్నామన్నారు. బాధితుల పట్ల గౌరవ న్యాయమూర్తులకు ఉన్నటువంటి సహృదయం, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం చాలా విచారించదగ్గదన్నారు.

ఇస్కాలో ఆకలి కేకలు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 4: తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా నిర్వహిస్తున్న 104వ జాతీయ శాస్త్ర సాంకేతిక సమ్మేళనంలో ఏర్పాటుచేసిన సైన్స్ విజ్ఞానమేళాను తిలకించడానకి వచ్చిన విద్యార్థులకు బుధవారం తిండి పెట్టలేని పరిస్థితిని నిర్వాహకులు కల్పించారు. దీంతో ప్రదర్శను తిలకించడానకి వచ్చిన విద్యార్థులు అన్నమో... రామచంద్రా అంటూ క్షుద్భాధతో విలవిలాడిన పరిస్థితి బుధవారం పలువురిని ఆవేదనకు గురిచేసింది. చాలామంది మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవడం కన్పించింది. వందకోట్ల రూపాయలు ఇస్కాకు ఖర్చుచేస్తున్నా వారు విద్యార్థులకు పట్టెడుఅన్నం పెట్టలేకపోయారా విద్యార్థుల తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతున్నారు. సైన్స్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా ఇప్పటివరకు దేశంలో సాధించిన అభివృద్ధిని తెలియజేసే విధంగా తిరుపతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుచేశారు. శాస్తస్రాంకేతిక రంగాలపట్ల విద్యార్థుల్లో ఆశక్తిని పెంచి వారిని భవిష్యత్‌లో అతిగొప్ప శాస్తవ్రేతలుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్రమోదీ, సిఎం చంద్రబాబునాయుడు అభిలషిస్తు ఇస్కా సదస్సులో విద్యార్థులకు పిలుపునిచ్చారు. పిలుపు అందుకున్న మ్యూజియం తిలకించడానికి వచ్చిన విద్యార్థులకు నిర్వాహకులు పట్టెడన్నం పెట్టలేకపోయారని విమర్శలు వినిపించాయి.
అయితే విద్యార్థులకు అన్నం పెట్టాలన్న ఆలోచన నిర్వాహకులు ఆలోచించలేదు. వారిని తీసుకొచ్చిన స్కూలు యాజమాన్యాలు ఆలోచించలేకపోవడంతో బుధవారం చాలామంది విద్యార్థులు క్షుద్భాధతో అల్లాడిపోయారు. ఈవిషయమై ముందుగా టిటిడి లాంటి ధార్మిక సంస్థను సంప్రదించినా మంచి ఫలితముండేదని పలువురు అనడం వినిపించింది. ఇస్కా సదస్సులో ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్టులో గుర్తింపు కార్డు పొందిన అతిథులకు మాత్రమే ప్రవేశం పొంది కడుపారా విందు ఆరగించారు. మ్యూజియం చూడడానికి వచ్చే విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది.

చెట్లకింద అల్పాహారాలు తీసుకుంటున్న విద్యార్థినులు

వీడియో కాన్ఫరెన్స్‌లు
శుద్ధ దండగ: అయ్యన్న
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 4: సంచలన వ్యాఖ్యలకు మంత్రి అయ్యన్న పాత్రుడు కేంద్ర బిందువుగా చెప్పాలి. పొరపాటు జరిగితే సొంత పార్టీ అయినా ఆయన లెక్క చేయరు. మొన్నటి జన్మభూమి-మావూరు కార్యక్రమంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా చంద్రన్న కానుకల పేరిట సంవత్సరానికి రూ.950 కోట్లు వృధా చేస్తున్నామని, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ వ్యాఖ్యానించిన అయ్యన్న రెండు రోజుల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలికాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో ప్రజల సమస్యలు పరిష్కారం కావని, ఇది పూర్తిగా దండుగ మారి విధానమని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘బ్రహ్మాండ’ మ్యూజియంకు బాబు శంకుస్థాపన

సప్తగిరులను తలపించేలా 7 సైన్స్ గ్లోబులు శ తిరుపతి పవిత్రతకు భంగం కలగకుండా పనులు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 4: శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్వీ జూపార్కుకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న రూ.1500 కోట్లతో నిర్మించనున్న బ్రహ్మాండ సైన్స్ మ్యూజియంకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మ్యూజియంను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వీలుకాలేదన్నారు. అయితే నేడు తాను మ్యూజియంకు భూమి పూజ చేసినా త్వరలోనే ప్రధాని చేత ప్రారంభింపజేస్తానన్నారు. దేశ రక్షణ రంగ సలహాదారు, ప్రముఖ శాస్తవ్రేత్త సతీష్ రెడ్డి సలహామేరకు నేడు ఈ మ్యూజియం ఏర్పాటుకు పునాదిపడిందన్నారు. 200 ఎకరాల్లో రూ.1500 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఏడు కొండలు సాక్షిగా స్వామివారి పాదాల చెంత మ్యూజియం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం ప్రశాంతతకు మారుపేరుగా ఉందని తెలిపారు. ఏడు కొండ కొండల తరహాలో ఇక్కడ ఏడు గ్లోబులు ఏర్పాటు చేసి వివిధ అంశాలపై పరిశోధనలకు అవసరమైన అన్ని వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇందులో ప్రధానంగా టియర్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, మెరైన్ లైఫ్,వ్యవసాయం, పురావస్తుశాఖ, ఏషియన్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటవుతుందన్నారు. తిరుమల, తిరుపతి పవిత్రతకు భంగం కలగని విధంగానే అభివృద్ధి ఉంటుందని చెప్పారు. 200 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా తిరుపతి పట్టణం విద్య, వైద్య హబ్‌గానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాగా ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న పరిసర ప్రాంతాల్లో ఎస్వీయూ, సంస్కృతం వర్శిటీ, వేద విశ్వ విద్యాలయం, మహిళ వర్శిటీ, అగ్రికల్చర్ వర్శిటీ, వెటర్నరీ వర్శిటీలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఎస్వీ, పద్మావతి మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మహానగరాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయన్నారు. ఈసందర్భంగా సి ఎం మ్యూజియం నమూనాను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజియం నమూనావద్ద ఎక్కడెక్కడ ఏ ఏ విభాగాలు ఏర్పాటుచేస్తున్నారో సతీష్ రెడ్డి సి ఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్స్ మంత్రి వై.సుజనాచౌదరి, రక్షణరంగ సలహాదారు సతీష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.