రాష్ట్రీయం

కరవు ఇక పరారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో కరవును శాశ్వతంగా నివారించడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కృషిచేస్తున్నానని, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు మేలు చేకూర్చే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. పిఠాపురం పట్టణంలో గురువారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక జగ్గయ్య చెరువు సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని పట్టిసీమ తరహాలో యుద్ధప్రాతిపదికన నిర్మించనున్నట్టు చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నదన్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. 1638 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌ను తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. రెండు దశల్లో పథకాన్ని పూర్తిచేస్తామన్నారు. తొలి దశలో పోలవరం డ్యాం దిగువన 3,500 క్యూసెక్కుల మిగులు జలాలను పోలవరం ఎడమ కాలువ 1.80 కిలోమీటర్ల దూరం వద్ద ఎత్తిపోస్తారని పేర్కొన్నారు. రెండవ దశలో 57.88కిలోమీటర్ల దూరంలో పోలవరం ఎడమ కాలువ నుండి అవసరమైనపుడు 1400 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు రిజర్వాయర్‌లోకి వదులుతామన్నారు. దీనివలన పోలవరం ఎడమ కాలువ ప్రారంభం నుండి 58 కిలోమీటర్ల వరకు ఉన్న ఆయకట్టు భూములతో పాటు, ఏలేరు రిజర్వాయర్ క్రింద ఉన్న భూములు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టు భూములకు కలిపి మొత్తం 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ జిల్లా వాసుల తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేందుకు కూడా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఉపయోగపడేలా నిర్మిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం వేసిన పునాదిరాళ్లను సమాధి రాళ్లుగా మార్చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, తాను ముఖ్యమంత్రులుగా ప్రారంభించిన పథకాలనే నేడు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. 75 సంవత్సరాల నాటి పోలవరం ప్రాజెక్టు కల కూడా తన హయాంలోనే సాకారం అవుతుండటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో సాగునీటి ప్రాజెక్టులంటే ఐదు నుండి పదిహేనేళ్ల పాటు నిర్మాణం జరుపుకునేవని, అటువంటిది పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేవలం ఏడాదిలో పూర్తిచేశామన్నారు. ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, చివరకు కడప జిల్లా పులివెందులకు కూడా ఈ నెల 11న తానే నీళ్ళు ఇవ్వనున్నానని, ఏ ప్రాంతంపైనా తనకు వివక్ష లేదని పేర్కొన్నారు.

చిత్రం..పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు