రాష్ట్రీయం

ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైమ్), జనవరి 9: జాతీయ విపత్తుల నివారణ (ఎన్‌డిఆర్‌ఎఫ్) దళం గత పదేళ్లుగా చేస్తున్న సేవలు దేశానికే గర్వకారణమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 10వ ఎన్‌డిఆర్‌ఎఫ్ బెటాలియన్ కొత్త భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ 2006లో ఏర్పాటైన ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలు తనకు తానే సాటి అన్నట్లు నిరూపించుకున్నాయని కొనియాడారు. జపాన్‌లో వచ్చిన సునామీ, నేపాల్‌లో వచ్చిన పెను భూకంపం సమయంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలు ఖండాంతరాలకు వ్యాపించాయని చెప్పారు. 1999లో సంభవించిన పెను తుపానులో 10వేల మంది చనిపోతే 2014లో వచ్చిన తుపానులో 49 మంది చనిపోయారని, జననష్టం నివారించటంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ చేస్తున్న సేవలకు ఇదే నిదర్శనమన్నారు. కేవలం తుపాను, వరదల సమయాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటమేగాక భూకంపాలు, రేడియో థార్మికత, బయొలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ సమయాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలను అభివృద్ధి పరచటంతోపాటు అన్నిరకాల వౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ కారణంగానే 10వ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు రాష్ట్రంలో గ్రేహౌండ్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాలు నెలకొల్పటానికి కృషి చేస్తానని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలను మరువలేమన్నారు. అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పటం ఇక్కడ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్ఛాపురం నుండి తడ వరకు సముద్ర తీరప్రాంతమని, ఏ తుపాను సంభవించినా ఏదోఒక ప్రాంతాన్ని తాకుతుందని హోంమంత్రికి వివరించారు. విభజన వల్ల రాష్ట్రానికి కొన్ని సంస్థలను కోల్పోయామని, ముఖ్యంగా గ్రేహౌండ్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్‌పిఎఫ్ దళాలు రాష్ట్రానికి ఎంతైనా అవసరం వుందన్నారు. రాష్ట్రానికి ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలు విస్తరించకుండా నిలువరించేందుకు ప్రత్యేక దళాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాజనాధ్ సింగ్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పరిగణనలోకి తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్‌కె పచనందా కోరిన విధంగా కొండపావులూరు నుండి నేషనల్ హైవే వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులను ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాల సేవలు మరువలేనివన్నారు. ప్రమాదాలు, విపత్కర పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇస్తున్న లక్షా 20వేల ఆర్థిక సహాయాన్ని 4 లక్షలకు పెంచిందన్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్‌కె పచానంద్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌డిఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఫొటోలో సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య, సుజనా చౌదరి తదితరులు