ఆంధ్రప్రదేశ్‌

గగనంలో సంక్రాంతి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ఈసారి విజయవాడలో అమోఘంగా జరుగుతున్నాయి. నగరం ఈ ఏడాది నూతన అనుభూతులను మదిలో నిలుపుకోనుంది. ఇప్పటికే నగరానికి పండుగ కళ వచ్చేసింది. ముగ్గుల పోటీలు, డిజిధన్ మేళా, ఎయిర్ షోలు ఒకటి వెంట మరొకటి జరుగుతూ నగరం సందడి సందడిగా ఉంది. పండుగ ముచ్చట్లతో కళకళలాడుతోంది. రాజధాని అవరావతితో పాటు నగరంలో ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల వంటి పలుచోట్ల ముగ్గుల పోటీలు చూడముచ్చటగా జరిగాయి. ఈ పోటీల్లో వేలాది మంది యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణీలు, పట్టు పరికిణీలు ధరించగా, మహిళలు చూడముచ్చటగా చీరలు కట్టుకొని పండుగ చేసుకున్నారు. రంగురంగుల ముగ్గులు, తప్పెట తాళాలు, విచిత్ర వేషధారణలతో నగరంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న గురువారం గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఎయిర్ షో ప్రారంభవౌతుంది. తొలుత నగరంలోని హోటల్ గేట్‌వేలో ఏవియేషన్ సమ్మిట్ నిర్వహిస్తారు. ఈ సమ్మిట్‌ని రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశ విదేశీ ఏవియేషన్ సంస్థలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పి అశోక్ గజపతిరాజు, వెంకయ్య నాయుడు, వైఎస్ చౌదరి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వారు, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఏవియేషన్ మార్కెట్‌లో 9వ స్థానం నుంచి 2030 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడం భారత్ లక్ష్యం. ఆ దిశగా ఉన్న అవకాశాలపై కూడా చర్చిస్తారు. సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రాంతీయ అనుసంధానతకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది. 12 నుంచి 14 వరకు మూడురోజుల పాటు కృష్ణా నదీతీరం వెంట కన్నులపండువగా ‘ఆకాశంలో అద్భుతం’ పేరుతో విమాన విన్యాసాలు జరగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ మొదటి ఎయిర్ షోని ఆద్వితీయంగా జరపాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం భవానీపురంలోని పున్నమి ఘాట్ నుంచి భవానీ స్నాన ఘాట్ వరకు 14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. నూతన రాజధాని అమరావతి పేరు దశదిశలా మారుమోగేలా పౌర విమాన శాఖ ఎయిర్ షోని జరుపుతోంది. విదేశీ ఎయిర్ క్రాప్ట్‌లు, బిటన్‌కు చెందిన 4 ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.

ఉక్కులో ప్రమాదం
150 టన్నుల
హాట్‌మెటల్ నేలపాలు
గాజువాక, జనవరి 11: స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1లో బుధవారం సంభవించిన ప్రమాదంలో ఉక్కు హాట్ మెటల్ నేలపాలై సంస్థకు నష్టం వాటిల్లింది. ఉదయం 6.30 గంటలకు లాడిల్‌కు రంధ్రం పడి సుమారు 150 టన్నుల హాట్‌మెటల్ నేలపాలైందని యాజమాన్య వర్గాలు, కార్మికుల సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ సంఘటనతో ఉక్కులో ఉత్పత్తి, ఉత్పాదకతకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఆ సమయంలో అక్కడ ఉద్యోగులు, కార్మికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని కార్మిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంఘటనలో ఉక్కు ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో మేల్కొన్న యాజమాన్యం ఉత్పత్తికి అంతరాయం వాటిల్లకుండా చర్యలు చేపట్టింది.

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
దుమ్ముగూడెం, జనవరి 11: సంక్రాంతి పర్వదినాన్ని తాను పుట్టిన ఊరిలో జరుపుకోవడానికి తెల్లవారక ముందే బయలుదేరిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామానికి చెందిన సాగి రంగారాజు(53), భార్య సుగుణ(47) స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని మురమళ్ల గ్రామానికి ద్విచక్రవాహనంపై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరారు. దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ భద్రాచలం నుంచి చర్లవైపు వెళ్తూ వారిని ఢీకొట్టింది. దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలి పరారయ్యాడు.
ఏసిబికి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీర్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 11: విజయనగరం జిల్లా సాలూరు మండలంలో పిఆర్ ఎఇగా పనిచేస్తున్న పి.రామగోపాలరెడ్డి ఎసిబి అధికారులకు చిక్కారు. బుధవారం ఉదయం పది గంటల సమయంలో కలెక్టరేట్ గేటు వద్ద సాలూరుకు చెందిన బి.సూర్యనారాయణ అనే కాంట్రాక్టర్ నుంచి ఎఇ రామగోపాలరెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ లక్ష్మిపతి తన సిబ్బందితో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. పురోహితునివలసలో కాంట్రాక్టర్ వేసిన రోడ్డు పనులను ఎం.బుక్‌లో నమోదు చేసేందుకు ఎఇ లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. రూ.5 లక్షల విలువైన రోడ్డు పనులకు రూ.3.50 లక్షల పని పూర్తయ్యింది. మిగిలిన రూ.1.50 లక్షల పనులకు సంబంధించి ఎఇ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారని ఎసిబి డిఎస్పీ లక్ష్మిపతి తెలిపారు.
ఏసిబి వలలో పులివెందుల మున్సిపల్ కమిషనర్
పులివెందుల: కాంట్రాక్టర్ నుంచి రూ. 15 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కమిషనర్ ఎన్.సూర్యమోహన్‌ను ఎసిబి అధికారులు బుధవారం పట్టుకున్నారు. నీళ్ల ట్యాంకర్ల సరఫరాకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు గాను కాంట్రాక్టర్ రాధను కమిషనర్ సూర్యమోహన్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం రాధ తన భర్త వెంకటరమణ సాయంతో ఎసిబి అధికారులను ఆశ్రయించింది. బుధవారం రాధ కమిషనర్‌కు రూ.15 వేల లంచం ఇస్తుండగా దాడులు జరిపి పట్టుకున్నట్లు ఎసిబి డిఎస్పీ నాగరాజు తెలిపారు.

ప్రోటోకాల్ విస్మరించిన
ఉద్యోగులకు మెమోలు
భద్రాచలం, జనవరి 11: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఓ ఉన్నతాధికారి విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్‌ను విస్మరించారంటూ ఐదుగురు ఉద్యోగులకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు మెమోలు జారీ చేశారు. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఆలయ దర్శనం కోసం వచ్చారు. నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. తీర్ధం, శఠారి కూడా సక్రమంగా ఇవ్వలేదు. అంతేకాకుండా ముక్కోటి రోజున ఉత్తరద్వారం వద్ద సిఎం కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సెక్టార్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెక్టార్‌లో ఉన్న న్యాయమూర్తిని మధ్యలో లేపి పక్క సెక్టార్‌కు మార్చారు. ఈ విషయంలో ఆలయ ఎఇఒ శ్రావణ్‌కుమార్, డిఇ రవీంద్రనాథ్, సూపరిండెంటెంట్ భవానీ రామకృష్ణ, ఉద్యోగి కిషోర్, ఆలయ ఉపప్రధానార్చకుడు గోపాలకృష్ణమాచార్యుల వివరణ కోరుతూ ఇఒ తాళ్లూరి రమేశ్‌బాబు వారికి మెమోలు జారీ చేశారు.