రాష్ట్రీయం

‘ప్రత్యేక’ దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి సందడి మొదలైంది..జనం పల్లెబాట పట్టింది. గురువారం నుంచి మూడు రోజులపాటు విద్యా సంస్థలకు, ఉద్యోగులకు వరస సెలవులు రావడంతో పండగకు జంటనగరాలనుంచి లక్షలాది మంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ జిల్లాలకు 2,430, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు 750 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలంగాణ ఆర్టీసి అధికారులు తెలిపారు. అయినా చాలకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే 140 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైళ్లలో బెర్త్ రిజర్వేషన్లు ఎప్పుడో రిగ్రేట్‌కు చేరుకున్నాయి. దీంతో జనరల్ బోగీల్లోకి వెళ్లేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. విచిత్రమేమంటే, రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ, రైల్వేస్ చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులపై పెనుభారం పడుతోంది. ఎంజిబిఎస్, జెబిఎస్ బస్టాండ్ల నుంచి గురువారం 750 ప్రత్యేక బస్సులు జిల్లాలకు వెళ్లినట్టు టిఎస్‌ఆర్టీసి అధికారులు తెలిపారు. వీటి సంఖ్య శుక్రవారం 900కు చేరనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు సుమారు 750 అదనపు బస్సులు నడుతున్నట్టు అధికారులు తెలిపారు. దూరప్రాంతాలైన అనంతపురం, బెంగుళూరు, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్నం, నంద్యాల, కర్నూల్ వంటి పట్టణాలకు నాన్ స్టాప్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.
ఇదిలా ఉంటే జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో టోల్ ప్లాజా వద్ద కనీసం అర గంట నుంచి గంటపాటు నిరీక్షించాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే వాహనాలు పంతంగి టోల్‌గేట్ వద్ద కార్ పాస్‌లతో కలుపుకుని రోజుకు 25వేల వాహనాలు నమోదవుతున్నాయి. మామూలు రోజుల్లో 18నుంచి 20వేల వాహనాలు రాకపోకలు జరుపుతుంటే, సంక్రాంతి పండగ సందర్భంగా 30శాతం వాహనాల రాకపోకలు పెరిగినట్టు అధికారులు తెలిపారు. చీలకల్లు, జగ్గయ్యపేట, నకిరేకల్ సమీపంలోని గొర్లపహాడ్, కృష్ణాజిల్లాలోని కీసర టోల్‌ప్లాజాల వద్ద కూడాట్రాఫిక్ స్తంభిస్తోంది.
ఇదిలావుండగా ఆర్టీసి దూరప్రాంతాలకు నడిపే సర్వీసులకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లను ప్రత్యేక చార్జీలతోనే నడుపుతోంది. మరో వైపుప్రైవేట్ ఆపరేటర్లు ఇదే అదనుగా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారం ఎక్కువ మొత్తాల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు.

చిత్రం..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్