రాష్ట్రీయం

బడిపిల్లలపైనా బాదుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి విద్యార్థి నుంచి పది రూపాయిలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో విద్యార్థుల నుండి కూడా ప్రభుత్వం వసూళ్లకు పాల్పడితే ఎలా? అని విపక్షాలు మండిపడుతుండగా, రాజధాని నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని తప్పుపట్టడం ఏ విధంగానూ సరికాదని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. వసూళ్లు ముఖ్యం కాదని, అమరావతి నిర్మాణంలో విద్యార్థులందరినీ భాగస్వామ్యులను చేయాలన్నదే ప్రభుత్వ భావన అని వినుకొండ ఎమ్మెల్యే జివి.ఆంజనేయులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ జీవితంలో ఎప్పుడైనా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులం అయ్యామని గర్వంగా చెప్పుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ యోచన చేసిందే తప్ప మరొకటి కాదన్నారు.
ప్రభుత్వ సూచన ప్రకారం ప్రతి విద్యార్థి 10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి వరకూ దాదాపు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇంటర్‌లో ఆరు లక్షలు, పిజి, వర్శిటీల స్థాయిలో మరో మూడున్నర లక్షల మంది ఉన్నారు. అంతా కలిపి దాదాపు 70 లక్షల మంది అవుతారు. అంటే దాదాపు ఏడు కోట్ల రూపాయిలు జమ అవుతాయి. ఈ మొత్తం రాజధాని నిర్మాణ వ్యయంతో పోల్చుకుంటే చాలా తక్కువే అయినా, వారి భాగస్వామ్యం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వ భావిస్తోంది. దీనిని మండల స్థాయిలో , జిల్లా స్థాయిలో పూర్తి చేయనున్నారు. ఈ మేరకు డిఇఓలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రపంచ స్థాయి నిర్మాణం వల్ల మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఈ సత్సంకల్పంతోనే భావి పౌరులైన విద్యార్థులను అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు తలా పది రూపాయిలు ఇవ్వాలని ప్రభుత్వం కోరిందని, అది కూడా ఆసక్తి ఉన్న వారి నుండే వసూలు చేస్తారని ఆంజనేయులు తెలిపారు. వైకాపా నేతలు దీనిపై చిలువలు పలువలుగా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో కూడా ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతోనే ‘నా ఇటుక-నా అమరావతి’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మూడు రోజుల్లోనే ప్రజలు 17 లక్షల ఇ-ఇటుకలను కొనుగోలు చేశారని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణంలో ప్రజలను సైతం ప్రత్యక్ష భాగస్వామ్యులను చేయలనే సత్సంకల్పంతోనే ‘నీరు-మట్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, దీంతో సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు నుండి మట్టి, యమునా నది నుండి నీరు తీసుకువచ్చి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు.
విద్యార్థుల నుండి చందాలా?
అమరావతి రాజధాని నిర్మాణానికి విద్యార్థులు, టీచర్లు చందాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం విచారకరమని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా, విలాసాల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్న చంద్రబాబు టీచర్లు, విద్యార్థులు పది రూపాయలు ఇవ్వాలంటూ సర్క్యులర్ జారీ చేయించడం తగదన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బొత్స మాట్లాడుతూ, ఇంతవరకు జన్మభూమి రెండు విడతలు జరిగిందని, ఇందులో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రెండు విడతల్లో లక్షలాది దరఖాస్తులు వస్తే ఇంతవరకు పరిష్కరించలేదని, రేషన్ కార్డులు, పెన్షన్ లాంటి సామాజిక భద్రత పథకాలను పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న మూడవ విడత జన్మభూమి మొక్కుబడిగా సాగుతోందని విమర్శించారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఒక తంతులా మారిందని, దీనికి అర్హులైన లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు పాటిస్తుందని అనేక సార్లు ప్రకటించిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోగా, ప్రజా ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. ఇసుక రేట్లు పది రెట్లు పెరిగాయని, ఆ మేరకు ఆదాయం ప్రభుత్వ రెవెన్యూలో కనపడడం లేదన్నారు. ఇసుక మాఫియా వల్ల ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుతున్నాయన్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.