రాష్ట్రీయం

జలాలపై మళ్లీ జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: కృష్ణా జలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ కీచులాట ప్రారంభమైంది. పరస్పరం ఫిర్యాదు చేస్తూ కృష్ణా బోర్డుకు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు లేఖలు రాశాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ నెలాఖరులోగా సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపి అదనంగా 3 టిఎంసి జలాలను వినియోగించుకుందని తెలంగాణ ఇరిగేషన్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి చౌర్యానికి పాల్పడుతోందనే అనుమానం ఉందని, శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తప్పుడు లెక్కల వివరాలు అందిస్తోందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగంపై కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అస్త్రాలకు కౌంటర్ వేస్తూ హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపును ఏపి ప్రశ్నించింది.
హైదరాబాద్‌కు గోదావరి జలాలను ఏ ప్రాతిపదికన సరఫరా చేస్తారని, దీనిపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయంటూ ఏపి ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బోర్డుకు శుక్రవారం లేఖ రాశారు. ఎస్సారెస్పీ వరదకాల్వ, దేవాదుల నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాల కేటాయింపు లేక పోయినా, ఎలా సరఫరా చేస్తున్నారంటూ, దీనిపై బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపి కోరింది.
పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నారని, తమకు ఎగువన కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్ల ద్వారా అదనంగా 40 నుంచి 80 టిఎంసి నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కేంద్రానికి, కృష్ణా బోర్డుకులేఖలు రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌కు గోదావరి జలాలను ఎలాసరఫరా చేస్తారనే అంశాన్ని లేవనెత్తింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అప్పటి కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు గోదావరి జలాలను రాజధానికి తీసుకువచ్చేందుకు నిధులు కేటాయించిన సంగతి విదితమే. ప్రస్తుతం కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వివరాల గడువు జనవరి 20వ తేదీతో ముగుస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 130 టిఎంసి నీటి లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు 43 టిఎంసి, ఆంధ్రాకు 87 టిఎంసిని గత నెలలో కృష్ణా బోర్డు కేటాయించింది.
ఇంతవరకు తెలంగాణ 19 టిఎంసి నీటిని వినియోగించుకోగా, ఆంధ్ర ప్రదేశ్ మాత్రం 40 టిఎంసిని వాడుకుందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం రెండు రిజర్వాయర్లలో 130 టిఎంసి నీటికి ఆరు టిఎంసిలు తగ్గుదల కనపడుతోందని కృష్ణా బోర్డు కూడా గుర్తించినట్లు సమాచారం. ఆవిరి వల్ల కూడా నీటి నిల్వలు తగ్గుతాయని, కాని ఎకాఎకిన మూడు టిఎంసిలు ఎలా తగ్గుతాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.