రాష్ట్రీయం

కోళ్లదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు/రాజమహేంద్రవరం, జనవరి 15: పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడి పుంజు మీసం మెలేసింది. సంక్రాంతి మూడురోజులు పందాలు ఎలా జరుగుతాయన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఇంతకుముందుతో పోలిస్తే మరింత విచ్చలవిడిగా సాగిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూడురోజుల్లోనూ పందెం బరుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ప్రాథమిక అంచనా. కోడిపందాలతోపాటు జూదాల జాతర కూడా ఈసారి ఊపందుకుంది. సంక్రాంతి కోడిపందాలు భోగిరోజున వైభవంగా ప్రారంభమై ఆదివారం అర్ధరాత్రి వరకూ యథేచ్ఛగా కొనసాగాయి. ఇక పందాల వద్ద పోలీసులు కనిపిస్తే ఒట్టు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఆడితే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికల బోర్డులు పందాలు జరిగిన ప్రాంతాల్లో దిష్టిబొమ్మలుగా మారాయి. అయితే కనుమతోనే పందాలు ముగిసినట్టు కాదనీ, మరో రెండురోజులు కొనసాగుతాయని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో కోట్ల రూపాయల జూదాలు సాగినట్లు నిఘా విభాగాల సమాచారం. డెల్టా ప్రాంతంలోని వెంప, ఐ భీమవరం, భీమవరం, పాలకొల్లు, మహాదేవపట్నం, ఆకివీడు, మొగల్తూరు, మెట్ట ప్రాంతాల్లోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దెందులూరు, పెదవేగి, టి నర్సాపురం, లింగపాలెం, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో భారీ నుంచి ఒక మోస్తరు పందాలు సాగినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద నిర్వహించిన కోడి పందాలకు దర్శకుడు వివి వినాయక్ హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోడి పందాలు, జూదాల్లో దాదాపు రూ.150 కోట్లు చేతులు మారినట్టు అంచనా. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు పందాలను పర్వవేక్షించాల్సి వచ్చిందని విమర్శలు చోటు చేసుకున్నాయి. కోనసీమలోని మురమళ్ళ, గోడి, గోడితిప్ప ప్రాంతాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా భారీస్థాయిలో బరులు నిర్వహించారు. కోనసీమవ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు రూ.100 కోట్ల వరకు పందాలు సాగినట్టు తెలుస్తోంది. మల్కిపురం, సఖినేటిపల్లి, రాజోలు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో అశ్లీల నృత్యాలు సాగినట్టు సమాచారం. ఈ ప్రాంతాల్లో కోడిపందాల బరులకు అనుబంధంగా మట్కా జూదాలు కూడా సాగాయి. ఒకవైపు గుండాట, మరో వైపు పేకాట శిబిరాలను భారీస్థాయిలో నిర్వహించారు. ఆదివారం రాత్రితో కొన్ని చోట్ల ముందస్తు ఒప్పందం మేరకు బిచాణా సర్దేశారు. సోమవారం నుంచి నామమాత్రంగా పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టేందుకు వ్యూహ రచన చేసుకున్నట్టు తెలిసింది.
గోడి, గోడిలంక, మురమళ్ళలో క్రికెట్ మైదానాన్ని తలపించే స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. ఈ ఊళ్లలో పోలీసుల జాడే లేదు. హోం మంత్రి చిన రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ చిన్నదో పెద్దదో పందెం బరులు సాగాయి. అనపర్తి నియోజకవర్గంలో కోడిపందాలు, దున్నపోతు పందాలు, పెద్దాపురం నియోజకవర్గంలోని పందులు, కోడిపందాలు, ముమ్మిడివరం నియోజకవర్గంలో కోడిపందాలతోపాటు పొట్టేళ్ళ పందేలు, భారీగా పేకాట, మట్కా జూదాలు సాగాయి. మద్యం ఏరులై పారింది.

చిత్రం..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప వద్ద కోడి పందాల బరి