రాష్ట్రీయం

‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కులవివక్షకు, చిత్రహింసలకు, వెలివేతకు గురై తీవ్ర మనస్థాపంతో బలవన్మరణం చెందిన వేముల రోహిత్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 17న సెంట్రల్ వర్సిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా సంస్మరణ సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి ప్రభాకర్, అధికార ప్రతినిధి దాసరి కిరణ్, ఇతర నాయకులు వెల్లడించారు. ఆరోజునే అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోనే కాకుండా విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాలు, వామపక్ష భావజాల సంఘాలతో కలిసి ‘దళిత హక్కుల దినం’గా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆరోజు రోహిత్ కుటుంబ సభ్యులెవరినీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి రాకుండా చేసేందుకు ఇప్పటినుంచే పోలీస్ యంత్రాంగం పన్నాగాలు పన్నుతోందని వారు ఆరోపించారు. రోహిత్ తల్లి వేముల రాధికమ్మ, సోదరుడు రాజా మాట్లాడుతూ రోహిత్ మరణించి ఏడాది కావస్తున్నా నేటివరకు ఏ ఒక్క నిందితుడిని అరెస్ట్ చేయకపోగా కనీసం చార్జిషీట్ కూడా దాఖలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ కేసులో నిందితులుగా వున్న కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావుతో సహా మొత్తం ఏడుగురిని కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసిఆర్ కలిసి కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇకనైనా విశ్వవిద్యాలయాల్లో కుల విద్వేషాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తక్షణం ‘రోహిత్ చట్టం’ తేవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాతృమూర్తులందరూ కదలి రావాలని ఇక్కడి ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు కోరారు.
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ పాలకులంతా కుమ్మక్కయి రోహిత్ తల్లిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అరుదైన ఘటనలో కుటుంబానికి పరిహారం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా నేటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. అటు కేసిఆర్ పట్టించుకోవడం లేదని, రోహిత్ ఈ ప్రాంతవాసి అయినా చంద్రబాబు కూడా పట్టించుకోవటం లేదన్నారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ఆరుమాసాల పాటు విచారించి రోహిత్ దళిత కటుంబానికి చెందినవాడని స్పష్టమైన నివేదిక పంపించారన్నారు. అయితే నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి తప్పించేందుకు అతని తండ్రి బిసి కనుక అదే కులం వర్తిస్తుందంటూ తప్పుడు నివేదికలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవానికి గతంలోనే సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చిందంటూ, తండ్రి పట్టించుకోని పక్షంలో తల్లి కులం వర్తిస్తుందనేది తెలియదా? అని ఆమె ప్రశ్నించారు.
రాధికమ్మ మాట్లాడుతూ రోహిత్ పుట్టిన తర్వాత తండ్రి ఏనాడూ పట్టించుకోలేదని, 20 ఏళ్లకు పైగా తమ మధ్య మాటలు కూడా లేవన్నారు. కనీసం రోహిత్ చనిపోయిన తర్వాత శవాన్ని కూడా చూసేందుకు రాలేదని, అయితే ఆయన బిజెపి నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ కంటతడి పెట్టారు. ఎంతోకొంత పరిహారం తీసుకుని ఈ కేసు వదిలేద్దామంటూ మధ్యవర్తుల ద్వారా రాయబారాలు పంపుతున్నాడన్నారు.
దళిత విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ రోహిత్ తన ఆత్మహత్య లేఖలో కులాలు, మతాలు, రంగుకాదు.. మనిషిగా గుర్తించండంటూ స్పష్టంగా పేర్కొన్నాడని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు విషయాన్ని పక్కనపెట్టి సహజ, సమాన న్యాయసూత్రం ప్రకారం రోహిత్ బలవన్మరణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయకపోగా కనీసం విచారించకపోవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం వారంతా స్వేచ్ఛగా తిరగటం అటుంచి చంద్రబాబు ఇటీవల జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అప్పారావుని ప్రధాని మోదీ చేతులమీదుగా సత్కరింపచేయటం చూస్తే రోహిత్ కేసులో ఏమాత్రం న్యాయం జరుగుతుందో ఇట్టే అర్థవౌతుందన్నారు. అందుకే ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వివరించారు. ఈసందర్భంగా పోస్టర్లు విడుదల చేశారు. విలేఖరుల సమావేశంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నేత ఎ మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రోహిత్ వర్ధంతి సభ పోస్టర్లు విడుదల చేస్తున్న రోహిత్ తల్లి రాధికమ్మ, సోదరుడు, తదితరులు