రాష్ట్రీయం

వీరులకు వరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణలో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అనేక వరాలు ప్రకటించారు. కుటుంబ క్షేమంకంటే దేశ క్షేమానే్న కాంక్షించి సైనికులు అహరహం పరిశ్రమిస్తున్నారని, అలాంటపుడు వారి క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాల్సి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సైనిక సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి ఈ నిధి నుంచి నిధులు ఖర్చు చేస్తామని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వోద్యోగులు ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏటా 25వేల రూపాయిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 10 వేలు, ప్రభుత్వోద్యోగులు ఒక రోజు వేతనం సంక్షేమ నిధికి అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ సదుపాయం ఉందని, అయితే ఇది మాజీ సైనికుల భార్యలకు వర్తించడం లేదని, ఇపుడు తాము ఆ అవకాశాన్ని వారికీ కల్పిస్తున్నట్టు చెప్పారు.
పరమవీరచక్ర, అశోక్‌చక్ర అవార్డు పొందిన తెలంగాణ వారికి ప్రభుత్వం రెండు కోట్ల 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని ప్రకటించారు. మహావీరచక్ర, కీర్తిచక్ర సాధించిన వారికి కోటి 25 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డుల కింద తెలంగాణ రాష్ట్రం 75 లక్షలు ఇస్తుందని, సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు పొందినవారికి 30 లక్షలు, మెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డు పొందినవారికి 25 లక్షలు, సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 25 లక్షలు, ఉత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 20, యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. దేశంలో ఇదే గరిష్ట మొత్తమని, ఏ రాష్ట్రంలో ఇంతమేర సైనికులకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సర్వీసు కాలంలో యుద్ధంలో మరణించిన సైనికులకు, ఇతర కారణాలతో మరణించిన సైనికులకు ఇస్తున్న పరిహారంలో వ్యత్యాసం ఉందని, అయితే ఏ కారణాలతో మరణించినా సైనికుల కుటుంబాలకు అదే పరిహారం తాము చెల్లించాలని నిర్ణయించామన్నారు. రానున్న రోజుల్లో 21 కొత్త జిల్లాల్లో సైనిక బోర్డులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మాజీ సైనికులు వారి పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. మిలటరీ స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపును ఇస్తామని, విద్యాసంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సిసి శిక్షణ ప్రోత్సహిస్తామన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమిలో చేరిన విద్యార్థులకు ఒకొక్కరికీ రెండు లక్షల చొప్పున ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సిఎం వివరించారు. సైనికులు ఏ రాష్ట్రంలోనైనా తమ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ చెల్లించివుంటే, తెలంగాణలో తిరిగి ట్యాక్స్ వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించామని అన్నారు. సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సైనికుల భార్య పేరిట ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మాజీ సైనికులకు రెండు శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్‌ను 3వేల నుండి ఆరు వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశామని అన్నారు.