రాష్ట్రీయం

ఒంటరిగా పోటీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 20: తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి అసలైన ప్రత్యామ్నాయం మేమే... ఒంటరిగానే పోటీ చేసి 2019లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటాం... అంటూ దక్షిణ అయోధ్య భద్రాచలం కేంద్రంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. రాబోయే రెండేళ్లలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం దిశగా కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుని, గ్రామ స్థాయి వరకు కార్యాచరణను తీసుకెళ్లేందుకు తగిన సమాయత్తాన్ని రాష్ట్ర కార్యవర్గం రచించింది. ‘అసలు పొత్తులే అవసరం లేదు... ఒంటరిగానే కదన రంగానికి దిగుతామని’ నేతలంతా ముక్త కంఠంతో ప్రకటించడంతో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. గడిచిన మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైన సమస్యలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును విశే్లషించడంతో పాటు క్షేత్ర స్థాయిలో భాజపాకు ఉన్న క్రేజ్‌ను కూడా అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీకి ఉన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఉండనే ఉన్నారు. ఇక ఈ సంఖ్యను విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపేందుకు పార్టీ శ్రేణులు కంకణం కట్టుకోవాలని నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నయం అని నిరూపించాల్సిన సమయం ఇదేనని నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి వైఫల్యాలే ప్రధానాస్త్రాలుగా ఎంచుకోవాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీర్మానించింది. దళితులకు 3 ఎకరాల భూమి, కెజి టు పిజి విద్య, రూ.40 వేల కోట్ల మిషన్ భగీరథ పథకంలో అవినీతి, రైతుల ఆత్మహత్యలు ఇలా వీటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని జిల్లా కమిటీలకు సూచించారు. రామరాజ్యం అంటూ భద్రాచలం కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని ఊదడం వెనక భాజపా ఎన్నికల వ్యూహం స్పష్టం అవుతోంది. తెలంగాణలో నాటి కాశీం, రజ్వీ పాలన సాగుతోందని జాతీయ కమిటీ సభ్యులు నాగం జనార్ధనరెడ్డి ఘాటైన ప్రకటన చేయడం విశేషం. కెసిఆర్ పాతబస్తీలో ఎంఐఎం సలహా తీసుకుంటానని అనడం, అక్కడి మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను కించపరచడమేనని ఆయన అన్నారు. అంతేకాకుండా కెసిఆర్ అలవికాని హామీలు గుప్పిస్తున్నారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తమిళనాడు తరహా రిజర్వేషన్ అని గొప్పలు చెబుతున్న కెసిఆర్ సుప్రీంకోర్టు, కేంద్రం చేసిన సూచనలు పెడచెవిన పెట్టడంపై ధ్వజమెత్తారు. అనేక పాలనా లోపాలు, ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రధానాస్త్రాలుగా ఎంచుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని భాజపా నేతలు ప్రకటిస్తున్నారు. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఎన్.లక్ష్మణ్ కూడా 2019 ఎన్నికలకు పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. నాయకులంతా ఒంటరి పోటీ జపంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రత్యామ్నయం తామేనని ప్రకటించడం పట్ల పార్టీ వర్గాల్లో ఆత్మ విశ్వాసం ద్విగుణీకృతమైంది.

చిత్రం..భద్రాచలంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను జ్యోతి వెలిగించి
ప్రారంభిస్తున్న కేంద్ర సహాయ మంత్రి దత్తాత్రేయ. చిత్రంలో పార్టీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ప్రభాకర్, నాగం ఉన్నారు