రాష్ట్రీయం

పులి‘చింత’లతో కన్నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 20: పులిచింతల ప్రాజెక్టులో కనీస నీటిమట్టం మేరకు జలాలు ఉండేలా చూడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఆ ప్రాజెక్టులో కనీసమట్టం మేరకు నీరు లేకపోతే తెలంగాణ పరిధిలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయవు. అందువల్ల ఈ ప్రాంత పరిథిలోని ఆయకట్టు రైతులు పంటలు నష్టపోతున్నారు.
ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు విద్యుత్ ఉత్పత్తిపైనా దీని ప్రభావం పడింది. 120 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న పులిచింతల విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైన ఒక యూనిట్ నీరందక నెల రోజులుగా మూతపడింది. ఇక పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన వెల్లటూరు, దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలకు రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం లేక మోటార్లు నడవడం లేదు. దీంతో నీటి సరఫరా లేక ఎత్తిపోతల కింద ఉన్న 18,900 ఎకరాల ఆయకట్టులోని పంటలకు నీరందడం లేదు. వీటిలో అధికశాతం భూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు అక్కరకు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెల్లుబుకుతోంది. మేళ్లచెర్వు, చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల నీటి ఆధారంగా 99 కోట్లతో వెల్లటూరు (శివగంగ) ఎత్తిపోతల పథకాన్ని 13,390 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించారు. వేమూరు, వెల్లటూరు, చింతలపాలెం, రేపాక, వేపలాపాలెం, రఘునాథపాలెం, తమ్మరం, దొండపాడు, గుడిమల్కాపురం పరిధిలోని రైతులు పత్తి, మిరప, వరి సాగు చేశారు. 30.44 కోట్లతో నిర్మించిన దొండపాడు ఎత్తిపోతల కింద 4,600 ఎకరాలు, మరో 30కోట్లతో నిర్మించిన నక్కగూడెం ఎత్తిపోతల కింద సాగులో వున్న వేయి ఎకరాలు (స్ధిరీకరణ ఆయకట్టు 3,600ఎకరాలు) సాగవుతోంది. ఈ మూడు ఎత్తిపోతల పథకాల మోటార్లు పులిచింతలలో కనీస నీటి మట్టం 3 టిఎంసిల నుండి 4 టిఎంసిలు ఉంటనే నడిచే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పులిచింతల రిజర్వాయర్‌లో 1.5 టిఎంసిల నీరు మాత్రమే ఉండటంతో సదరు ఎత్తిపోతల మోటార్లు నడువక ఆయకట్టు పంటలకు సాగునీటి కొరత ఏర్పడింది.
కృష్ణాబోర్డుకు లేఖ
ఈ పంటలను కాపాడేందుకు ఎత్తిపోతల మోటార్లు పనిచేసేందుకు వీలుగా పులిచింతలలో కనీస నీటిమట్టాన్ని నిర్వహించాలని టిఎస్ నీటిపారుదల కార్యదర్శి ఇటీవల కృష్ణాబోర్డుకు లేఖ ద్వారా నివేదించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటు ఏపి నీటి పారుదల శాఖ కార్యదర్శికి కృష్ణా రివర్ బోర్డు సూచించింది. అయితే ఎగువ నుండి తగినన్ని నీళ్లు రాని పరిస్థితుల్లో తామేమీ చేయలేమని ఏపి ఇరిగేషన్ శాఖ చెబుతోంది. గత్యంతరం లేని స్థితిలో రైతులు బోర్లకు మోటార్ల బిగించి నీటిని తోడుతున్నారు. డీజిల్, మోటారు ఖర్చులతో తడిసిమోపెడు భారం మోయాల్సి వస్తోంది.
ముంపులో ఎత్తిపోతల పథకాలు
పులిచింతల రిజర్వాయర్ నిర్మాణంతో రేబల్లె, చిత్రియాల ముంపు గ్రామాల్లోని రెండు ఎత్తిపోతల పథకాలు సైతం ముంపునకు గురయ్యాయి. వాటిని తరలించడంలో సైతం జాప్యం సాగుతుండటం కూడా రైతులను నష్టపరుస్తోంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆయకట్టు కోసం వేలకోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టు, ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తే మరింత తక్షణ ప్రయోజనం లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. పంటల పరిరక్షణ దిశగా ప్రభుత్వ తక్షణం చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.

చిత్రం..అడుగంటిన పులిచింతల రిజర్వాయర్