రాష్ట్రీయం

నోట్ల రద్దు వృథా కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: కేంద్రప్రభుత్వం తాజాగా చలామణిలోకి తీసుకువచ్చిన రెండువేల రూపాయల నోట్లు కూడా ఎక్కువ కాలం చలామణిలో ఉండబోవని పుణెకు చెందిన అర్థక్రాంతి సంస్థాన్ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్దనోట్ల రద్దుకు అనిల్ బొకిల్ ఆలోచనలే కారణమంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. భారతీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించి అర్థక్రాంతి రూపొందించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించేందుకు తొమ్మిది నిమిషాల సమయం కావాలని అనిల్ బొకిల్ గతంలో ఒక పర్యాయం అడిగారు. గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అనిల్ బొకిల్‌ను ఆహ్వానించి అర్థక్రాంతి ఆలోచనలు వినేందుకు సమయం ఇచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు నివేదికను వినేందుకు సమయం ఇచ్చిన మోదీ దాదాపు రెండు గంటలపాటు బొకిల్‌తో చర్చించారు.
నోట్లరద్దు నిర్ణయం వృథా కాలేదని, భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని బొకిల్ గుర్తు చేశారు. ఈ అంశంపై ఎవరైనా తుది నిర్ణయానికి వచ్చే ముందు సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. పన్నుల రూపంలో వైట్‌మనీ బ్యాంకులకు పెద్దఎత్తున చేరిందన్నారు. లెక్కల్లోకి రాని డబ్బు స్థానిక సంస్థలకు పన్నుల రూపంలో కోట్లాది రూపాయల రూపంలో వచ్చిందన్నారు. ధనికుల వద్ద పన్ను చెల్లించని నల్లధనం పెద్దనోట్ల రూపంలో సంచుల్లో నిలువ భారీఎత్తున ఉండిపోయిందన్నారు. భారతదేశం పన్నురహిత, నగదు రహిత ఆర్థిక వ్యవస్థవైపు పరుగులు తీయాల్సి ఉందని అనిల్ బొకిల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల నిర్వహణ అతి తక్కువ చార్జీలతో, వీలైతే రెండు శాతం కన్నా తక్కువ శాతం చార్జీలతో కొనసాగాలన్నారు. నగదు లావాదేవీలు ఒక పర్యాయం రెండువేల రూపాయల కన్నా ఎక్కువ ఉండరాదని, అంతకుమించి లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా మాత్రమే కొనసాగాలని అభిప్రాయపడ్డారు.
బ్యాంకులకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తేనే వారు తక్కువ వడ్డీకి ప్రజలకు రుణాలు ఇవ్వగలుగుతారని బొకిల్ తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో బ్యాంకులు రెండు శాతం కన్నా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండగా, భారత్‌లో గృహ, ఇతర రుణాలు పదిశాతం అంతకు మించి ఉన్నాయని గుర్తు చేశారు.
అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రభుత్వం వినియోగిస్తున్న నిధుల్లో చాలా వరకు బ్లాక్‌మనీగా వివిధ స్థాయిలలో కొందరు పెద్దల జేబుల్లోకి వెళుతుండటంతో సామాన్యులకు లబ్ది చేకూరడం లేదన్నారు. ప్రభుత్వ నిధులు ఏదోఒక రూపంలో రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయన్నారు. ప్రజలు, అధికారుల ద్వారా ఈ డబ్బు రాజకీయ నేతలకు చేరుతోందని, ఈ డబ్బును వారు ఎన్నికల ఖర్చుకోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిత్వం వల్ల భారతీయులు చెడిపోవడం లేదని, పరిస్థితుల ప్రభావం వల్ల చెడిపోతున్నారన్నారు.
తాగునీటిని రెండు రోజులపాటు సరఫరా చేయడం లేదని ప్రకటిస్తే, ప్రజలు తమకు అందుబాటులో ఉన్ననీటిని పాత్రల్లో ఎక్కువగా నిలువ చేసుకుంటారని, అదే నీటిని 24 గంటల పాటు సరఫరా చేస్తే, ఏ ఒక్కరూ కూడా నిలువచేసుకోరని ఉదాహరణగా చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల గ్రామీణులు ఎవరూ ఇక్కట్లకు గురికాలేదని, గ్రామాల్లో వందరూపాయలు, 50 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. ఒక సర్వే ప్రకారం సామాన్యుడి రోజువారీ వ్యయం 150 రూపాయలకు మించదన్నారు. నగదురహిత లావాదేవీలకు గ్రామీణులు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, అంతవరకు నగదుతోనే లావాదేవీలు కొనసాగవచ్చన్నారు.
రెండువేల రూపాయల నోట్లు ఎక్కువ కాలం మనుగడలో ఉండబోవని ఒక ప్రశ్నకు సమాధానంగా అనిల్ బొకిల్ తెలిపారు. వందరూపాయలు లేదా అంతకు తక్కువ నోట్లు చలామణిలో ఉండాలనే తమ సంస్థ (అర్థక్రాంతి సంస్థాన్) భావిస్తోందన్నారు. రెండువేల రూపాయల నోటు ప్రింట్ చేసేందుకు 3.29 రూపాయలు మాత్రమే వ్యయం అవుతోందని మరొక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

చిత్రం..అనిల్ బొకిల్‌ను శాలువాతో సన్మానించి, బొకే అందజేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ