రాష్ట్రీయం

అగ్రగామి ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27: రాష్ట్రంలో 2050 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశంలో ఇప్పటికే విద్యుత్, మత్స్య పరిశ్రమ, పాలనలో సాంకేతిక వినియోగం వంటి అనేక అంశాల్లో ఎపి అగ్రగామిగా కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే 12.23 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపి నిలిచిందని చెప్పారు. విశాఖలో ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు చేశారు. గత ఏడాది కుదిరిన ఒప్పందాలలో 42 శాతం కార్యరూపం దాల్చాయని చెప్పారు.
భాగస్వామ్య సదస్సుకు విశాఖలో శాశ్వత వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. 2050 నాటి 1.40 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు పారిశ్రామిక టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 28 శాతం తక్కువ వర్షం కురిసినా, వ్యవసాయ రంగంలో 28 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ అందించనున్నామని చెప్పారు. 2019 నాటికి ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించనున్నామని చంద్రబాబు వివరించారు. ప్రతి కుటుంబంలో కనీసం 10 వేల రూపాయల ఆదాయం ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి చమురు రంగంలో 1.28 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. దీనికి అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయలు చమురు రంగంలో పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.
ఏపీవైపు భారత్ చూపు: వెంకయ్య
కేంద్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచం అంతా భారత్‌వైపు చూస్తుంటే, భారత ప్రభుత్వం ఏపి వైపు చూస్తోందన్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, పారిశ్రామిక విధానం మన దేశ ఆర్థిక పురోగతిలో కీలక భూమికను పోషిస్తున్నాయని వెంకయ్య వివరించారు. అనేక విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలో రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. వృద్ధి రేటును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని అన్నారు.
ఏపీలో గెయిల్, ఓఎన్‌జిసి
భారీ పెట్టుబడులు: ధర్మేంద్ర
పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఏపిలో ఒఎన్‌జిసి, గెయిల్ సంస్థల భాగస్వామ్యంలో 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. 2029 నాటికి దేశ అభివృద్ధిలో చమురు, సహజవాయువుల రంగం కీలకం కానుందని ఆయన చెప్పారు. ఈ రంగంలో 1.43 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపికి రానున్నాయని ఆయన తెలియచేశారు. కెజి బేసిన్‌లో రానున్న రోజుల్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటిష్ పెట్రోలియం తదితర చమురు సంస్థలు ఏపిలో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని చెప్పారు. వృద్ధిరేటు సూచికల్లో మానవ అభివృద్ధి సూచికలను కూడా చేర్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో నరేంద్ర మోదీ, చంద్రబాబు ఉండేవారని మంత్రి ప్రభు అన్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ అభివృద్ధి విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అందరి మన్ననలు పొందారని చెప్పారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
భావి ప్రయోజనాలే
పరమావధి:నిర్మలా సీతారామన్

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉందని, ట్రేడ్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన సంస్కరణల వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆమె చెప్పారు.

చిత్రం..సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి ముందు కేంద్రమంత్రులు, వాణిజ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు