రాష్ట్రీయం

ఖర్చుకు వెనకాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఇంకా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి వేర్వేరుగా అన్ని పార్టీల సభ్యులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. ఎస్సీలపై అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్టీలపై అధ్యయనానికి మంత్రి చందూలాల్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలు ప్రభుత్వానికి చేసే సిఫారసులనే అమలు చేస్తామన్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అన్ని పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సిఎం సమావేశం నిర్వహించారు. తెరాస ప్రజా ప్రతినిధులతోపాటు కాంగ్రెస్‌కు చెందిన నంది ఎల్లయ్య, గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్ తెదేపాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య, సిపిఎంకు చెందిన సున్నం రాజయ్య సహా 38మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాగా వారితో కలిసి సిఎం భోజనం చేశారు. సిఎస్ ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి తదితరులతోపాటు నిర్వహించిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అందరం కలిసి ఆలోచించి విధానం రూపొందించుకుని పకడ్బంధీగా అమలు చేసుకోవాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనుకున్న విధంగా ముందుకు పోతుందని, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కూడా బాగుందన్నారు. రాష్ట్ర అభివృద్ది రేటు దేశంలోనే అత్యధికంగా ఉందని, ఈ ఫలితం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నది తమ లక్ష్యమని సిఎం అన్నారు. ఈ వర్గాలలోని యువకులు, విద్యార్థులు, వృద్ధులకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలన్న అంశంపై అధ్యయనం జరగాలన్నారు. ఈ అధ్యయనంలో 10-25, 25-50, 50-75 వయసుల వారీగా వేర్వేరుగా వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. భావితరాలకు మంచి విద్య అందించడం ద్వారా వారికి మంచి జీవితాన్ని కల్పించాలన్నారు. వీరి కోసం గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, విద్యార్థినులకు ప్రత్యేకంగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు, పట్టణ ప్రాంతాల్లో ఇతర కోర్స్‌లు అభ్యసించే యువతులకు వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నప్పటికీ వారికి పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో వ్యవసాయం జరగడం లేదని, ఆర్థిక వనరులుగా అవి మారలేదన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి అసైన్డ్ భూములు ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఏ ఊరిలో ఎవరి పేరుపై భూమి ఉంది, అది సాగవుతుందా? లేదా? లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం వేర్వేరుగా నియమించిన కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ఏంచేయాలో వారే నిర్ణయించి నివేదిస్తే కమిటీల సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని, వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక తీసుకురావడం మంచి పరిణామన్నారు. గతం అనవసరమని, విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా నిజంగా ఈ వర్గాలకు ఏది అవసరమో అదే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు ఒక ప్రణాళిక, సెమీ అర్బన్‌లోని వారికి, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వేర్వేరుగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. దళితులకు ఉచితంగా మూడు ఎకరాలు భూమి ఇవ్వడమే కాకుండా వాటికి విద్యుత్, నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కమతాల ఏకీకరణ జరగాలన్నారు. బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం మార్పులు చేసిందని, ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులను తొలగించి రెవెన్యూ, కాపిటల్ పద్దులు మాత్రమే ఉండాలని కేంద్రం సూచించిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల్లో కూడా మార్పులు రావాలని, జనాభా ప్రాతిపదికన, వారి నిష్పత్తికి అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగేలా ప్రణాళికను రూపొందించుకుందామని ముఖ్యమంత్రి సూచించారు.
ఎస్సీ కమిటీ
కమిటీ అధ్యక్షునిగా కడియం శ్రీహరి, సభ్యులుగా నంది ఎల్లయ్య, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్, బాల్క సుమన్, ఎంఎస్ ప్రభాకర్, సండ్ర వీరయ్య, నల్లాల ఓదేలు, రసమయి బాల్‌కిషన్, కిశోర్, సంజీవరావు ప్రత్యేక ఆహ్వానితునిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఎస్టీ కమిటీ
అధ్యక్షునిగా చందూలాల్, సభ్యులుగా డిఎస్ రెడ్యానాయక్, నగేశ్, సీతారామ్ నాయక్, కోవ లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లను నియమించారు.

చిత్రం..ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష ప్రజా ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్