రాష్ట్రీయం

రాజధానిలో విదేశీ భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ఎన్‌ఆర్‌ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మించాలని, భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావే వెల్లడించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి దానేశ్వర్ మూలే శనివారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ వ్యవహారాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు పెద్దఎత్తున వెళ్తున్నందున వారి వ్యవహారాల పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలను బలోపేతం చేయాలని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి తగిన సహకారం అందించాలని కోరారు. తెలంగాణ నుంచి పెద్దఎత్తున విదేశాలకు వెళ్తున్నందున తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మించాలని, దీనికోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని సిఎం చెప్పారు. విదేశాలకు వెళ్లి మోసపోయే వారి విషయంలో, ఇబ్బందుల్లో చిక్కుకున్న వారి విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి సాయం అందించే కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. దాదాపు పదిహేనేళ్లుగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగు పరుచుకుంటున్నాయని మూలే చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా విదేశీ వ్యవహారాల శాఖను బలోపేతం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ పలు సూచనలు చేశారు.
తెలంగాణతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం ప్రజలు పెద్దఎత్తున వివిధ దేశాలకు వెళ్తున్నారన్నారు. వారికి అనేక విషయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్నిసార్లు దళారుల చేతిలో మోసాలకు గురవుతున్నారని అన్నారు. కిడ్నాప్‌లు జరుగుతున్నాయి, కేసుల్లో ఇరుక్కుంటున్నారు, వారందరికీ తగిన సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని సిఎం అన్నారు. విదేశీ పెట్టుబడులకు దేశంలో అనుమతులు ఇవ్వడంతోపాటు, సెజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నందున పెద్దఎత్తున విదేశీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు మన దేశానికి వస్తున్నారన్నారు. వారికీ తగిన విధంగా ప్రభుత్వం సహకారం అందించాలని, దీని కోసం విదేశీ రాయబార కార్యాలయాలను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర రాజధానుల్లో విదేశీ భవన్‌లు నిర్మించాలని, తెలంగాణలో నిర్మించే విదేశీ భవన్‌కు స్థలం కేటాయించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. మంత్రి కెటిఆర్, ఇతర అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కెసిఆర్ కోరారు.
భారత దేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని సిఎం కెసిఆర్ అన్నారు. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత దేశం విదేశాలతో మంచి సంబంధాలు నెరుపుతుంది. ఎగుమతులు, దిగుమతులు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తగత స్థాయిలోనూ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రాముఖ్యం పెరుగుతోందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారికి, విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి తగిన అవగాహన కల్పించాలని, ప్రభుత్వమే మార్గదర్శకం చేసేలావుంటే మోసాలు తగ్గుతాయని కెసిఆర్ చెప్పారు.
వరంగల్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయం
వరంగల్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు విదేశీ వ్యవహారాల కార్యదర్శి దానేశ్వర్ మూలే ప్రకటించారు. సిఎంతో మూలే సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయం అవసరాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మూలే వరంగల్‌లో తప్పకు పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు కోసం వరంగల్‌లో అనువైన స్థలాన్ని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే పాస్ పోర్టు అధికారులు వరంగల్ వెళ్లి అనువైన స్థలాలు చూస్తారని చెప్పారు. పాస్‌పోర్టు, వీసా జారీల్లో జాప్యాన్ని నివారిస్తామని, అనవసర ఇబ్బందులు తొలగిస్తామని, మోసాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని మూలే వెల్లడించారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం: మూలే
అత్యంతవేగంగా పాస్‌పోర్టులను జారీ చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని మూలే చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారని అభినందించారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మిస్తామని మూలే ప్రకటించారు. సమావేశంలో రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వని, తెలంగాణలో విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి విష్ణు, సిఎంఓ అధికారులు నర్సింగ్‌రావు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.