రాష్ట్రీయం

‘ఖజానా’లో దొంగలు పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిమ్మరాజు చలపతిరావు
విజయవాడ, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో చేయి తడపనిదే ఏ బిల్లూ ముందుకు కదలదనేది అక్షర సత్యం. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల బిల్లులకు సంబంధించిన కోట్లాది రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా తమ సొంత బ్యాంక్ ఖాతాలకు మళ్లిస్తున్న వైనం ‘ఆంధ్రభూమి’ దృష్టికి వచ్చింది. గత మూడు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ ఖజానా శాఖ ఉన్నతాధికారులెవరూ నోరు మెదపకపోవటం ఆశ్చర్యం. ఒకవేళ ఈ దందా బయటపడి నిందితులను అరెస్ట్ చేసినా పూర్తిగా రికవరీ జరిగేందుకు ఎనేళ్లు పడుతుంది? కోల్పోయే వడ్డీ సొమ్మును ఎవరు భరిస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.
సాధారణంగా మొదటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులే కాకుండా కాంట్రాక్టులు, స్కాలర్‌షిప్‌లు, ఆసుపత్రులు, జైళ్లు, హాస్టళ్లలో డైట్, ఇతర ప్రభుత్వ పద్దుల కింద ఆయా ప్రభుత్వ శాఖల నుంచి నేరుగా జిల్లా ట్రెజరీలకు బిల్లులు వస్తుంటాయి. వాటి పరిశీలన పూర్తయిన తరువాత బ్యాంక్‌లకు వెళితే అక్కడినుంచి ఆ బిల్లులకు సంబంధించిన నగదు నేరుగా సంబంధిత సంస్థలు, లేదా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. ‘కార్పొరేట్ నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్’ కింద సదరు బిల్లు మొత్తం తొలుత ట్రెజరీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. దీనిపై ఖజానా సిబ్బందికే ఇ-చెక్ అధికారం కల్పించింది. దీంతో బ్యాంక్‌ల నుంచి బిల్లులు తిరిగి రావటంతోనే స్థానిక ట్రెజరీ కార్యాలయాల నుంచే సిబ్బంది నేరుగా వ్యక్తులు, లేదా సంస్థల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేస్తూ వచ్చారు. దీనికి సంబంధించిన పాస్‌వర్డ్ సమాచారం చిరు ఉద్యోగులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక సిబ్బందిలో కొందరు క్రమేణా అక్రమార్జనకు పాల్పడటం మొదలైనట్లు వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అత్యధికంగా గుంటూరు
జిల్లాలో రూ. కోటీ 20 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 75 లక్షలు, ప్రకాశం జిల్లాలో రూ. 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ. 20 లక్షలు, విజయనగరం జిల్లాలో రూ. 20 లక్షలు, ప.గో జిల్లాలో 20 లక్షల వరకు నిధులు దారిమళ్లినట్లు తెలిసింది. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదేవిధంగా అవినీతి, అక్రమాలు భారీగా జరిగాయి. తెనాలిలో రూ. కోటీ 6 లక్షల రూపాయలు దారిమళ్లాయి. తండ్రి మరణానంతరం ట్రెజరీ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన వరుణ్‌బాబు తెనాలి మున్సిపల్ ఖాతాలకు సంబంధించిన వివిధ బిల్లుల మొత్తాలను నేరుగా తన బ్యాంక్ ఖాతాకు, బంధువుల ఖాతాలకు దశలవారీగా మళ్లించినట్లు వెల్లడైంది. దీంతో అతని జీవనశైలిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తరచూ విమాన ప్రయాణాలు, ఖరీదైన కార్లు కొని విలాసవంత జీవితాన్ని గడపటం ప్రారంభించడంతో తోటి ఉద్యోగుల్లో అనుమానాలు రేగాయి. దీంతో అసలు సంగతి బట్టబయలైంది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి రికవరీ కోసం ప్రయత్నిస్తున్నామని తెనాలి డిఎస్పీ రమణమూర్తి ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. రికవరీ చేద్దామంటే దాదాపు కోటి రూపాయలు పూర్తిగా ఖర్చయ్యాయి. ఇక తాజాగా ప్రకాశం జిల్లా దర్శిలో సబ్ ట్రెజరీ అధికారి శ్రీనివాసులురెడ్డి పెన్షనర్లకు సంబంధించిన దాదాపు రూ. 10 లక్షలను దారి మళ్లించి నేరుగా తన జిపిఎఫ్ ఖాతాకు జమ చేసుకోటం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. పెన్షనర్లు చనిపోయిన వెంటనే సాధారణంగా రెండు, మూడు నెలల తర్వాతగానీ సబ్ ట్రెజరీ కార్యాలయాలకు సమాచారం అందదు. దీంతో ఎప్పటిలా బిల్లులు రెడీ అవుతుంటాయి. ఇలాంటి సమయంలో ఆ మొత్తాలను తిరిగి ప్రభుత్వ ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా ఆ అధికారి మాత్రం ఆ మొత్తాలను నేరుగా తన ఖాతాలకు మళ్లించుకున్నాడు. ఈవిధంగా పలు ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఇటీవల భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై ఖజానా, లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ కనకవల్లిని సంప్రదించగా ఆమె తోసిపుచ్చారు. ట్రెజరీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదంటూనే కృష్ణా, విశాఖ జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బోగస్ బిల్లులు రాగా తమ సిబ్బంది తెలియక పాస్ చేసి పంపించారని, దీనిపై పోలీస్ విచారణ జరుగుతోందని మాత్రం వెల్లడించారు. అసలు మీకు ఇలాంటి సమాచారం ఎవరు చెప్పారంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు.