రాష్ట్రీయం

రాష్ట్రంలో దుష్టపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 29: రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన చతుర్ముఖ దుష్టపాలన రీతిలో జరుగుతోందని వైసిపి అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల కేంద్ర సంస్ధ ఎన్‌సిఎఇఆర్ ఇచ్చిన నివేదికలో రాష్ట్రం అవినీతిలో నెంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారని చెప్పారు. వ్యవస్థలను, మనుషులను, మీడియాను కూడా మేనేజ్ చేయటంలో చంద్రబాబు ఘనుడన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు మాత్రం తన పదవికి రాజీనామా చేయకుండా అన్నివిధాలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. అవినీతి పాలన ఏస్ధాయికి చేరుకుందంటే రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసినా, బినామీలకు పూర్తిగా లాభాలను కట్టబెట్టకున్నా ఏమీ అనలేక చివరకు కమీషన్లు తీసుకుని దందాలు నడిపించే స్థాయికి చేరిపోయారన్నారు. స్విస్ ఛాలెంజ్ పేరుతో వేల ఎకరాలను తన కిష్టమైన కంపెనీలకు కమీషన్లు తీసుకుని ఇచ్చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 16వేల కోట్ల నుంచి 40వేల కోట్ల రూపాయలకు పెంచేసి, పనిచేయలేకపోతున్న కాంట్రాక్టరును తొలగించకుండా, కొత్తవారిని ప్రవేశించనీయకుండా కాపాడుతున్నారని విమర్శించారు. తన బినామీలను సబ్ కాంట్రాక్టర్లుగా చేర్చేశారని విమర్శించారు. చివరకు చంద్రబాబు గుడి భూములను కూడా వదలటం లేదని, సదావర్తి భూముల కుంభకోణం అందరికి తెలిసిందేనని చెప్పారు. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ భూములను కూడా వదలకుండా విజయవాడ నడిబొడ్డున ఉన్న భూములను కూడా కమీషన్లు తీసుకుని లక్ష రూపాయల లీజుకు పంచిపెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక రాజధాని అంటూ రకరకాల మాటలు చెప్పి బంగారం లాంటి భూములు తీసుకుని ఇప్పుడు తాత్కాలిక భవనాల పేరుతో భారీ అవినీతికి తెరతీసారన్నారు. ఎక్కడైనా భవనం కడితే అడుగు 1500 రూపాయలకు చేస్తారని, ఇక్కడ మాత్రం అడుగు 10వేల రూపాయలకు కేటాయించేసి అందులో కూడా లాభాన్ని సొంతం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇసుక, మట్టి దొంగలు కన్పిస్తున్నారని చెపుతూనే జన్మభూమి కమిటీల నుంచి కేబినేట్ వరకు, చివరకు ముఖ్యమంత్రి వరకు కూడా దొంగతనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విభజిస్తున్న కారణంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా కేటాయిస్తామని హామీ ఇచ్చినా దాన్ని గట్టిగా అడగలేని పరిస్ధితుల్లో చంద్రబాబు చిక్కుకున్నారన్నారు. ఇప్పటివరకు జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి మోది మొట్టికాయ వేసి బొక్కలో పెడతారన్న భయంతో చంద్రబాబు ప్యాకేజీకి రాజీపడ్డారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒక మహిళా తహసిల్దార్‌ను జుట్టుపట్టుకుని కొట్టినా ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అలాగే ఈమధ్య ఒక యువతి మరణానికి టిడిపి నేత కారణమని వారి బంధువులు చెపుతున్నా ప్రమాదం అంటూ కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మనం అంతా కదిలి మంచి భవిష్యత్ కోసం సన్నద్ధం కావాలని, ఇక బాబు సర్కార్‌ను బంగాళాఖాతంలో కలపడం ఒకటే మిగిలిందని పేర్కొన్నారు.
వైసిపిలో కోటగిరి తనయుడు
బహిరంగ సభలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీ్ధర్... జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు.తన తండ్రి విద్యాధరరావు తన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాజకీయాలనే ఎంచుకోవాలని చెప్పారని, అయితే టిడిపిలో మాత్రం చేరవద్దని, జగన్‌తో జతకట్టాలని చెప్పారన్నారు. ఆ కల ఇప్పటికి నెరవేరిందన్నారు. ఆయనతోపాటు మధ్యాహ్నపు బలరామ్ కూడా పార్టీలో చేరారు.

చిత్రం..ద్వారకా తిరుమల బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్