రాష్ట్రీయం

భక్తరామదాసు కీర్తనలకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 29: ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు కీర్తనలకు అరుదైన గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 1111 మంది నృత్య కళాకారిణులు ఆదివారం శ్రీ సీతారామచంద్రుని సన్నిధిలో ఏకకాలంలో ఆయన కీర్తనలతో భద్రాద్రి నృత్యాభిషేకం చేశారు. భక్తరామదాసు కీర్తనలకు ఇందరు కళాకారులు నృత్యం చేయడం ఒక రికార్డుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయింది. ఈమేరకు తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు వెంకటాచారి భద్రాద్రి నృత్యాభిషేకం నిర్వహించిన బెక్కంటి శ్రీనివాస్‌కు బంగారు పతకంతో పాటు రెండు గుర్తింపు పతకాలు అందజేశారు. నృత్యాభిషేకం చేసిన చిన్నారులకు సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. అంతకుముందు ఉదయం భక్తరామదాసు శిలా విగ్రహానికి భద్రాచలం మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బులికృష్ణ, ఏఇవో శ్రావణ్‌కుమార్, తాళ్లూరి పంచాక్షరయ్య, పాకాల దుర్గాప్రసాద్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథాచార్యులు, బెక్కంటి శ్రీనివాసరావు, తిప్పన సిద్దులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి భద్రాద్రి నృత్యాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఇదిగో భద్రాద్రి.. గౌతమి అదిగో చూడండి’ అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన భక్తరామదాసు కీర్తనకు 2 నిమిషాల 43 సెకన్లు, ‘నను బ్రోవమని చెప్పవే’ అంటూ మంగళంపల్లి ఆలపించిన కీర్తనకు 3 నిమిషాల 16 సెకన్లు, ‘ఆయనే ఆలపించిన అంతా రామమయం’ అనే 4 నిమిషాల 3 సెకన్ల కీర్తనలకు 1111 మంది చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి, జానపదం, పేరిణి, గిరిజన, తదితర సంప్రదాయ నృత్యాలను కనువిందుగా ప్రదర్శించారు. చిన్నారుల అభినయానికి ఆలయ ప్రాంగణమే పులకించిందా అన్నట్లు ప్రదర్శన సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన భద్రాద్రి నృత్యాభిషేకం తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కినట్లు నిర్వాహకులు వెంకటాచారి ప్రకటించగానే భద్రగిరి పరవశించింది. తన భక్తుడు భక్తరామదాసు రాసి, ఆలపించిన కీర్తనలకు అరుదైన గౌరవం లభించడంతో వైకుంఠ రాముడు కూడా పులకించిపోయాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ఈ ప్రదర్శన రికార్డు పుస్తకాల్లోకి ఎక్కిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అనంతరం 100 మంది నృత్య కళాకారిణులు 10 గ్రూపులుగా విడిపోయి రామాయణ ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

చిత్రం..భద్రాద్రిలో కనువిందు చేసిన బాలికల నృత్యాభిషేకం