రాష్ట్రీయం

బోసిపోతున్న తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలుగు రాష్ట్రాలు పేరుకే తెలుగు రాష్ట్రాలయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు మాతృభాషలో పరిపాలన సాగిస్తుంటే, మన రెండు రాష్ట్రాలు మాత్రం సొంత భాషను చులకన చేసే పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది మాట్లాడే మాతృభాషలో పరిపాలన చేయాలన్న వౌలిక సూత్రాన్ని కూడా పక్కన పెట్టేశారు. తెలుగు తెలిసిన అధికారులు ఉండరు. పరిపాలకులకు పట్టింపు ఉండదు. వెరసి తెలుగును ఇంగ్లీష్‌లో ఉచ్చరించే పరిస్థితి దాపురించింది. మన రాష్ట్రాల్లో మన తల్లిభాషకు ఏ విధంగానూ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రభుత్వాల పనితీరే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు), చట్టసభల్లో బిల్లుల ఆమోదం తదితర కార్యక్రమాలన్నీ ఇంగ్లీషులోనే దశాబ్దాలుగా కొన సాగుతున్నాయి. ప్రభుత్వం రోజూ జారీ చేసే ఉత్తర్వులు అన్నీ ఇంగ్లీషులోనే వస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతి రోజూ సరాసరిన 30 ఉత్తర్వులు జారీ అవుతుంటాయి.
ఒకరోజు పది ఉత్తర్వులు జారీ అయితే మరోరోజు 60 లేదా 70 ఉత్తర్వులు కూడా జారీ అయిన సందర్భాలుంటాయి. వీటిలో ఒక్కటి కూడా తెలుగులో జారీ కావడంలేదు. జీఓలను తెలుగులో తీసుకురావాలని గతంలో ఒక సారి ప్రయత్నం జరిగింది. ఎబికె ప్రసాద్ ఎపి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక జీఓ తెలుగులో జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు క్రమంగా ఇంగ్లీషులో ఉత్తర్వులు వెలువరించడం మానుకుని తెలుగులో ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు. ఏళ్లు గడిచిపోతున్నా, తెలుగులో జీఓలు మాత్రం రావడంలేదు. శాసనసభ, శాసనమండలిలో అజండా, ప్రవేశపెట్టే బిల్లులు, ప్రకటనలు తెలుగు, ఇంగ్లీషులో ఉంటున్నప్పటికీ బిల్లులకు సభ ఆమోదం తీసుకునే సమయంలో ఇంగ్లీషులోనే కానిచ్చేస్తున్నారు. బిల్లును సభలో ప్రవేశపెట్టాలని, మార్పులు, చేర్పులు (అమెండ్‌మెంట్స్) గురించి, సభ ఆమోదం తీసుకునే సమయంలో ఇంగ్లీషునే వాడుతున్నారు. ఒక్క బిల్లుకు ఆమోదం తీసుకునేందుకు కూడా తెలుగుభాషను వాడటం లేదు. చట్టసభల్లో ఉండే సభ్యులంతా తెలుగుమాతృభాష కలిగినవారే కాకుండా, తెలుగులో ధారాళంగా మాట్లాడే స్వభావం ఉన్నవారే. సమైక్య తెలుగు రాష్ట్రంలో 59 ఏళ్లలో కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత గత రెండున్నర ఏళ్లలో కానీ చట్టసభలో బిల్లుల ఆమోదం కోసం ఒక్కసారి కూడా తెలుగుభాషను ప్రధానంగా వినియోగించడం లేదు. తెలంగాణలో తెలుగుమాట్లాడే ప్రజలు 90 శాతం వరకు ఉన్నారు. మరో 10 శాతం జనాభాకు ఉర్దూ మాతృభాషగా కలిగి ఉన్నారు. ఇంగ్లీషు మాతృభాషగా ఉన్నవారు ఇటు తెలంగాణలో కానీ, అటు ఎపిలోకానీ వాస్తవానికి ఒక్కశాతం కూడా లేరు. ఇంగ్లీషు మీడియంలో చదివేవారు కూడా తమ మాతృభాష గురించి తెలియ చేయాలంటే తెలుగు అనే రాస్తారు.
అధికార భాషా సంఘం నామమాత్రంగానే ఉంటోంది. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా గతంలో ఎందరో మహానుభావులు పనిచేసినప్పటికీ, భాషకు సంబంధించి ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకు రాలేకపోయారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా తెలుగులో ప్రావీణ్యం ఉన్నవారే అయినప్పటికీ, తెలుగు భాషకు ప్రాధాన్యత లభించడం లేదు.
పరిపాలనలో కీలకభూమిక పోషించే ఐఎఎస్ అధికారులు మాత్రం ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటున్నారు. వీరి ప్రభావం వల్ల తెలుగుభాష అభివృద్ధి కాకుండా, పరిపాలనలో అమల్లోకి రాకుండా నిలువరిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.