రాష్ట్రీయం

6న ఢిల్లీకి అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి అఖిల పక్షం బృందం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాబోతుంది. ఈనెల 6న సిఎం కె చంద్రశేఖర్‌రావు సహా ఢిల్లీకి రానున్న అఖిలపక్ష బృందానికి పిఎంవో అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. దీంతో ఈనెల 5న సాయంత్రం అఖిలపక్షం బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును బడ్జెట్ సమావేశాలల్లోనే ఆమోదించాలని ప్రధాన మంత్రిని అఖిలపక్షం కోరనుంది. ఈమేరకు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలను ఢిల్లీకి ఆహ్వానిస్తూ శుక్రవారం సిఎం కెసిఆర్ లేఖలు రాశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, టిటిడిపి అధ్యక్షుడు రమణ, సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డిలను సిఎం ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, ప్రస్తుత చట్టంలో ఈ బడ్జెట్ సమావేశాలల్లోనే మార్పులు తీసుకురావాలని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అన్ని పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు ఎన్నికల ప్రణాళికలో తెరాస హామీ ఇచ్చింది. తెరాస అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని ప్రధాన మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్టు సిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలాగూ అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తుండటంతో, పనిలో పనిగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఉస్మానియా వర్శిటీ శతాబ్ధి ఉత్సవాల ప్రారంభానికి ఆహ్వానించాలని సిఎం నిర్ణయించారు.
ఇంటింటికి మంచినీటిని అందించడానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరగడానికి, చిన్న చిన్న ఆయకట్టుకు సాగునీటిని అందించడానికి, అలాగే చేపల పెంపకానికి ఉపయోగపడనున్న మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఇప్పటికే అనేకమార్లు ప్రధానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాకర పథకాలకు నయా పైసా కేటాయించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ప్రత్యేకంగా పథకాన్ని ప్రారంభించడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి స్వయంగా ప్రారంభించారు. మిషన్ భగీరథ పథకం బాగుందని, ఇతర రాష్ట్రాలు కూడా పథకాన్ని అధ్యయనం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథకు కేంద్ర బడ్జెట్‌లో తప్పనిసరిగా నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అయితే మిషన్ భగీరథే కాకుండా మరే పథకానికి బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించలేదు. అఖిలపక్ష బృందం ప్రధాన మంత్రితో జరిపే సమావేశంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించాలని సిఎం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రితో జరిగే అఖిలపక్ష సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో ముఖ్యమంత్రి చర్చించారు.
అఖిలపక్షంలో వైకాపాకు నో ఛాన్స్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశాలకు తమనూ ఆహ్వానించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే డిమాండ్ చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి వైకాపాను ఆహ్వానించలేదు. దీంతో వైకాపా హైకోర్టును ఆశ్రయించడంతో ఇకనుంచి జరిగే సమావేశాలకు ఆహ్వానించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. తాజాగా ఢిల్లీకి వెళ్లే అఖిలపక్ష బృందంలో వైకాపాకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం గమనర్హం.