రాష్ట్రీయం

తిరుమలలో వైభవంగా రథసప్తమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3: శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడకలు శుక్రవారం అత్యంత వేడుకగా జరిగాయి. దీంతో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మాఘశుద్ధ సప్తమినాడు సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి అత్యంత వైభవంగా నిర్వహించింది. ఒక్కరోజే శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడా వీధులలో ఊరేగుతూ, భక్తులను అనుగ్రహించారు. ఈ వాహనాల సేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు. సూర్యదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 5.30గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి.
సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్యభగవానుడు తన ఉషాకిరణాలను ప్రసరించి స్వామివారికి అంజలి ఘటించాడా అన్నట్లుగా నాలుగుమాడా వీధుల్లో విహరిస్తున్న స్వామివారిపై ప్రసరింపజేయడంతో సూర్యప్రభ వాహనాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. అనంతరం 9 గంటలకు చిన్న శేష వాహనంపై విశేషాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని దర్శించుకుని పులకరించిపోయారు. ఉదయం 11 గంటలకు స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడనిపై రాజఠీవితో తరలివస్తుంటే భక్తులు చేసిన గోవింద నామ స్మరణలతో తిరుమాడా వీధులు మారుమోగాయి. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందుచేశారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు అర్చకస్వాములు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం వరాహ పుష్కరిణిలో భక్తుల గోవింద నామ స్మరణల నడుమ చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం సాయంత్రం 4 గంటలకు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షాన్ని తన వాహనంగా చేసుకుని కదలివచ్చిన స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. సాయంత్రం 6గంటలకు సర్వభూపాల వాహనంపై అనంతరం రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి ఉత్సవాలు ముగిశాయి. ఈకార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు, జెఇఒ శ్రీనివాసరాజు, ఇన్‌చార్జ్ సివిఎస్‌ఓ జి.శ్రీనివాస్, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, భానుప్రకాష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, అరికెల నర్సారెడ్డి, అనంత, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.

చిత్రం....తిరుమల మాడ వీధుల్లో శుక్రవారం .రాత్రి చంద్రప్రభ వాహన సేవ దృశ్యం