రాష్ట్రీయం

రెండు రోజుల్లో కోలుకుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: కుటుంబ సభ్యుల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో కిమ్స్‌లో చికిత్స పొందుతున్న దర్శకుడు దాసరి నారాయణరావును పరామర్శించారు. దాసరికి చికిత్స అందిస్తున్న వైద్యులతో ఆయన మాట్లాడి, దాసరి వెంటనే కోలుకునే రీతిలో వైద్యం అందించిన వారిని అభినందించారు. దాసరి ఆరోగ్యంగా ఉన్నారని, ఆప్యాయంగా పలకరించారని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పాత్రికేయులకు చెప్పారు. శ్వాస తీసుకోవడంలో కొంత సమస్య ఉందని, రెండు రోజుల్లో దాసరి మామూలు స్థితికి వస్తారని ఆయన చెప్పారు. దాసరి ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. దాసరి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని తెలిసిన వెంటనే చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులును ప్రభుత్వం తరఫున పంపించామని చెప్పారు. అనంతరం చంద్రబాబు ఈనాడు అధినేత రామోజీరావును పరామర్శించారు. నందమూరి రామకృష్ణ ఇంట్లో జరిగిన ఒక శుభకార్యంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు.
థాంక్స్ గివింగ్ వేడుకకు వస్తా: దాసరి
దాసరి నారాయణరావును కాంగ్రెస్ ఎంపి చిరంజీవి శుక్రవారం పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన చిరంజీవి వైద్యులతో మాట్లాడారు. వెంటిలేటర్‌పై ఉన్న దాసరి నారాయణ రావు తనతో మాట్లాడలేకపోయారని, కానీ తన భావనను ఒక కాగితంపై రాసి చెప్పారని తెలిపారు. దాసరి తొందరగా కోలుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఖైదీ నెంబర్ 150 చిత్రానికి వచ్చిన కలెక్షన్ల గురించి తనను వాకబు చేయడం ఆనందాన్ని ఇచ్చిందని చిరంజీవి చెప్పారు. ఆయనకు మానసిక స్థైర్యం ఎక్కువ కనుక త్వరలో పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుండి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పనిచేస్తారని అన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా థాంక్స్ గివింగ్ వేడుకకు తప్పకుండా వస్తానని దాసరి తనకు మాట ఇచ్చారని ఆయన తెలిపారు. రెండు మూడు రోజులు ఐసియులో ఉన్న అనంతరం తిరిగి జనరల్ వార్డుకు బదిలీ చేస్తామని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శుక్రవారం సినీనటి జయప్రద, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, నటులు మురళీ మోహన్, మోహన్‌బాబు, నిర్మాత అల్లు అరవింద్, వైకాపా నేత అంబటి రాంబాబు తదితరులు కూడా దాసరిని పరామర్శించారు.
వెంకయ్య పరామర్శ
దాసరిని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. దాసరి కోలుకుంటున్నారని, ఆయనకు మెరుగైన వైద్యం అందించారని వెంకయ్యనాయుడు తెలిపారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో సినీ దర్శకుడు దాసరి నారాయణరావును పరామర్శిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు