రాష్ట్రీయం

ఏసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 5: విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమ ఆస్తులు కలిగిన భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. విజయవాడలో పని చేస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు కొల్లూరి రామ సుబ్బారావు ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించారు. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు విజయవాడలోనూ చర స్థిర ఆస్తులను కొనుగొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2నుంచి 3 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు 40కోట్ల పైగానే ఉంటుందని అంచనా. పైగా సదరు అధికారి ఉద్యోగం మాటున పెద్ద మొత్తంలో కాల్‌మనీ వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు దాడుల్లో వెల్లడైంది. సుమారు కోటి 30లక్షల మేర మార్కెట్‌లో అధిక వడ్డీకి కాల్‌మనీ తిప్పుతున్నట్లు వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గత చాలాకాలంగా అవినీతి ఆరోపణలున్నాయని, దీంతో నిఘా వేసి పక్కా దర్యాప్తు చేసిన మీదట కోర్టు ఆనుమతి తీసుకుని విజయవాడలోని ఇతని ఇంటితోపాటు, అన్ని చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఏసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కొల్లూరి రామసుబ్బారావు (47) అత్తగారి ఇల్లు గుంటూరు జిల్లా తెనాలి. ఈయన ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోనే సాగింది. 1996లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీరుగా చేరి ఆతర్వాత అసిస్టెంట్ ఇంజనీరుగా, ప్రస్తుతం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరుగా పదోన్నతిపై గుణదల పొట్రెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. మొగల్రాజపురంలోని విభాగంలో ఏఇగా కనస్ట్రక్షన్స్, ఆపరేషన్స్‌లో పని చేశాడు. గుణదల సెంట్రల్ స్టోర్స్‌లో విధులు నిర్వహించే సమయంలో వివిధ సామాగ్రి కొనుగోలులో అవినీతి ఆరోపణలున్నాయి. విజయవాడకు ముందు తెనాలి, గన్నవరం తదితర చోట్ల కూడా పని చేశాడు. కాగా ఇతనిపై ఎప్పటి నుంచో వస్తున్న ఆవినీతి ఆరోపణల నేపధ్యంలో ఏసిబి అధికారులు నిఘా పెట్టి ఎట్టకేలకు ఈదాడులు నిర్వహించారు.
అక్రమ ఆస్తుల వివరాలు ఇవే..
ఏసిబి దాడుల్లో ట్రాన్స్‌కో ఏడిఇ సుబ్బారావు అక్రమ ఆస్తుల చిట్టా గుర్తించిన అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మారుతీనగర్ ప్రకాశరావు వీధిలో ప్రస్తుతం నివాసముంటున్న ఇంటిపై దాడి చేశారు. 216గజాల మూడంతస్తుల అధునాతన ఫర్నిచర్ స్వంత ఇంటితోపాటు, భారతీనగర్ లోని సుస్మిత టవర్స్‌లో ఒక ప్లాటు, ప్రక్కనే 349 గజాల స్థలం, కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని బండారుగూడెం వద్ద 3.99 ఎకరాలు, అక్కడే మరో 48 సెంట్లు మెరక భూమి, దాని ప్రక్కనే 50సెంట్లు స్థలం, అదేవిధంగా నెల్లూరులో ఓ ఇంటి స్థలం, అక్కడే మరొకటి కొని అమ్మేసినట్లు గుర్తించారు. గన్నవరం సమీపంలోని సూరంపల్లిలో 2003లో వివాదాస్పద స్థలం ఎకరా 65సెంట్లు కొనుగోలు చేశాడు. ఇక్కడే 326 గజాల ఇంటి స్థలం కూడా ఉంది. ఇక్కడే 533.32 చదరపు గజాల లే అవుట్ స్థలంతోపాటు గుణదల కామినేని నగర్‌లో 300 గజాలు, అక్కడే మరో 150 గజాలు, గన్నవరం వెదురుపావులూరులో 266 గజాలు గుర్తించారు. గుంటూరు జిల్లా బాపట్లలో 198 గజాల స్థలం, ప్రకాశం జిల్లా దర్శిలో 18గజాల షట్టర్ కలిగిన షాపు, అక్కడే 291 గజాల స్థలం, గన్నవరంలో 533 గజాల స్థలం, గుంటూరు జిల్లా పెనుమాకలో 25సెంట్లు, మంగళగిరిలో 178 గజాలు స్థిరాస్తులు వెలికితీశారు. ఇవి కాకుండా ఒక కేజీ బంగారం, అర కేజీ వెండి, నాలుగు లక్షల షేర్లు, బ్యాంకుల్లో 15నుంచి 20లక్షల వరకు నగదు, డిపాజిట్లు, ఒకకారు, ఒక యాక్టివాని గుర్తించి సీజ్ చేసినట్లు డిఎస్పీ చెప్పారు. ఇవి కాకుండా రామసుబ్బారావు ఇంట్లో ఖాళీ ప్రామిసరీనోట్లు, చెక్కులు లభించాయి. కోటి 30లక్షల మేర కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారణైంది. గత కొన్ని మాసాలుగా రహస్య విచారణ చేపట్టి అక్రమ ఆస్తులను నిర్ధారించుకున్న మీదట కోర్టు అనుమతితో ఈ దాడులు నిర్వహించినట్లు, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
పూర్వికుల నుండి సంక్రమించాయ: ఏడిఇ
కాగా ఈ దాడుల సందర్భంగా నిందితుడు ఏడిఇ కొల్లూరి రామసుబ్బారావు విలేఖరులతో మాట్లాడుతూ తనకు పూర్వికుల నుంచి సంక్రమించిన ఆస్తులేనని, తానేమీ అక్రమాలకు పాల్పడలేదని, ప్రతిదానికి ఇన్‌కం ట్యాక్సు సబ్మిట్ చేస్తున్నట్లు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. ఈ దాడుల్లో డిఎస్పీ వి గోపాలకృష్ణ నేతృత్వంలో సిఐలు కె.వెంకటేశ్వర్లు, బి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.