ఆంధ్రప్రదేశ్‌

హిందూపురం ‘దేశం’లో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఫిబ్రవరి 4: హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు ముదురుపాకాన పడ్డాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎ కనుమూరి శేఖర్ తీరుపై అసంతృప్తవాదులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా శనివారం ఇద్దరు జడ్పీటీసీలు పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని బాలయ్య హెచ్చరించినా అసంతృప్తవాదులు వెనక్కు తగ్గలేదు. ఆదివారం చిలమత్తూరులో సమావేశం విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తాజా రాజీనామాలతో అసంతృప్తవాదుల సభ విజయవంతమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏను తొలగించే వరకూ విశ్రమించబోమని మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడు, టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూ అసంతృప్తవాదులతో సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. పార్టీ ఆవిర్భావం నుండి తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గుర్తింపు పొంది ప్రజాసేవ చేస్తుంటే బాలకృష్ణ పిఏగా శేఖర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తమను ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నాడని, అయినా అటు ఎమ్మెల్యే ఇటు అధిష్ఠానం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిలమత్తూరు జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి, లేపాక్షి జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాలను పార్టీ అధిష్ఠానానికి, జిల్లా పరిషత్ సిఇఓకు, జడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్, ఎమ్మెల్యే బాలకృష్ణకు పంపడం దుమారం రేపింది. లంచగొండి శేఖర్‌ను తప్పించకపోగా కార్యకర్తల మనోభావాలు, వాస్తవాలను ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలియచేసేందుకు అసంతృప్తవాదులు ప్రయత్నిస్తుంటే అడ్డుకట్ట వేయడానికి పన్నాగం పన్నడం బాధాకరమని నేతలు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ పిఏ శేఖర్ వారం రోజుల తర్వాత శనివారం హిందూపురం వచ్చారు. లేపాక్షిలో శేఖర్‌కు మద్దతుగా ఎంపిపి హనోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ నామమాత్రంగానే సాగింది. అదే సమయంలో హిందూపురంలో టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సీనియర్ టిడిపి నాయకులు సమావేశమయ్యారు. శేఖర్‌ను సాగనంపేంత వరకూ విశ్రమించబోమని వారు ప్రతినబూనారు. చిలమత్తూరులో ఆదివారం జరిగే సమావేశాన్ని అడ్డుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే సిసి పేర్కొనగా మూకుమ్మడి రాజీనామాలకు తెర లేపుతామని అంబికా లక్ష్మీనారాయణతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. కాగా ఇన్‌చార్జి పదవుల కోసమే స్థానిక నాయకులు తనపై బురద జల్లుతున్నారని పిఏ శేఖర్ పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. శేఖర్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే సిసి, అంబికా తోసిపుచ్చారు. నందమూరిపురంగా ఉన్న హిందూపురంలో శేఖర్ లంచగొండిగా మారి అటు కార్యకర్తలు, ఇటు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. శేఖర్‌ను తప్పించి ఎవరికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చినా పార్టీ పటిష్టత, బాలకృష్ణకు మంచి పేరు తెచ్చేందుకు శ్రమిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హిందూపురం నియోజవర్గంలో పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలు విధించారు.

చిత్రం... రాజీనామా లేఖలను చూపిస్తున్న జడ్పీటీసీలు
లక్ష్మినారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి