రాష్ట్రీయం

ప్రజామోదంతోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 6: గుంటూరు వేదికగా జరిగిన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సుకు హాజరైన రైతులు తమ అభ్యంతరాలను వెల్లడించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని రహదారుల వలన జరుగుతున్న నష్టంపై ఆందోళనతో ఉన్న రైతులు సభకోసం బుధవారం ఉదయమే గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. సమావేశానికి హాజరైన సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో ప్లానింగ్ అధికారి రాముడు మాస్టర్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టిన వెంటనే రైతులు లేచి గ్రామాల మధ్యగా రహదారులు ఎందుకు వస్తున్నాయో ముందుగా వివరించాలంటూ ఆందోళన చేశారు. వెంటనే కమిషనర్ శ్రీకాంత్ జోక్యం చేసుకుని మీ అభిమతానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదంటూ వివరణ ఇచ్చారు. రానున్న రెండురోజుల్లో రాజధానిలోని 29 గ్రామాల్లో సభలు నిర్వహించి భూములిచ్చిన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామన్నారు. ఇది డ్రాప్టు మాస్టర్ ప్లాన్ మాత్రమేనని, తుది రూపం ఇంకా తయారు కాలేదని, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేస్తామన్నారు. త్వరలో రూపకల్పన చేసే మాస్టర్ ప్లాన్‌లో భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపుపై స్పష్టంగా పేర్కొంటామన్నారు. రాజధానిలోని 29గ్రామాల్లో 26 టౌన్‌షిప్‌లు వస్తాయని, ప్రతి టౌన్‌షిప్‌లో లక్ష మంది జనాభా నివసించే విధంగా ఏర్పాట్లు ఉంటాయని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.
మంగళగిరి మండలం నవులూరు గ్రామస్థురాలు ప్రేమలత మాట్లాడుతూ గ్రామకంఠాల మధ్య నుంచి రహదారులు చూపిస్తున్నారని, వెలుపలనుంచి నిర్మించాలని కోరగా, తుళ్లూరు గ్రామస్థుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలందరితో మాట్లాడాల్సిన అవసరం లేదని, బాధితులను గుర్తించి నష్టపరిహారం అందిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. ఉండవల్లి గ్రామస్థుడు సాంబశివరావుమాట్లాడుతూ జరీబు భూములిచ్చిన రైతులకు అక్కడే స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ కెనాల్, కరకట్టపై రహదారులు చూపించారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. నీరుకొండ గ్రామంలో పొలం ధర 10 లక్షల రూపాయలు మాత్రమేనని, ఉండవల్లి గ్రామంలో ఎకరం ధర రూ 10 కోట్లు పలుకుతుందంటూ దాసరి కృష్ణ అధికారుల దృష్టికి తీసుకురావటంతో రైతుల మధ్య కొంతసేపు వాదులాట జరిగింది. ఇరువురికి ఒకేరకమైన పరిహారం ఇస్తే ఎలా అంటూ ఉండవల్లి రైతు ప్రశ్నించారు. మందడం గ్రామ రైతు రమేష్ మాట్లాడుతూ భూములిచ్చిన రైతులందరికీ చట్టబద్ధత కల్పించాలని కోరారు. వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని అనంతవరం రైతు కొమ్మినేని సాంబశివరావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రహదారుల కారణంగా నిరాశ్రయులయ్యే వారిని గుర్తించి కాలనీలు నిర్మించాలని రావిపాటి నాగేశ్వరరావు కోరారు.
మంగళగిరి ఎంపిపి రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం భయపెట్టి రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకుందని ఆరోపించారు. భూములు తీసుకునే సమయంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు గ్రామాల్లో తిరిగారని, ప్రస్తుతం వేదిక వద్దకు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశంపార్టీ వర్గీయులు లేచి ఎదురుదాడికి దిగారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జోక్యం చేసుకుని రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, రాజకీయాలకు తావులేదన్నారు. గ్రామాల్లో రహదారులు నిర్మిస్తే రవాణా సౌకర్యాలు సమకూరి అభివృద్ధి చెందుతాయని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎంపి గల్లా స్పష్టం చేశారు. అదనపుకమిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.