రాష్ట్రీయం

పరాధీనంలో రామయ్య భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారిపేరిట సుమారు 1400 ఎకరాల భూములున్నప్పటికీ, వాటిలో 80 శాతం పరాధీనంలో ఉండటంతో ఆలయానికి ఆదాయం రావడం లేదు. కౌలుపై సాగుచేస్తున్న రైతుల నుంచి ఏటా 40 లక్షల రూపాయలు మించి రావడం లేదని అధికారిక లెక్కల వల్ల తెలుస్తోంది. పరాధీనంలోవున్న రాములోరి భూములు వెనక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలితాలివ్వడం లేదు. ఆదాయం రాకపోవడానికి కారణాలు అనేకంగా ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. భద్రాచలం పట్టణంలోనే దాదాపు 40వేల చదరపు గజాల అత్యంత విలువైన భూమి ఉంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మండలంతోపాటు దుమ్ముగూడెం, కొప్పగొంపల్లి, పర్ణశాల, లక్ష్మీనర్సింహారావుపేట, బూర్గంపహాడ్, సీతానగరం, ములకలపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సుమరు 300 ఎకరాల భూములున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిశాయి. అలా కలిసిన వాటిలో పురుషోత్తమపట్నంలోని 1 నుండి 101 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 889.20 ఎకరాలతో పాటు 15/1, 15/3, 5/1, 5/3, 4/1, 4/1బి తదితర సర్వే నెంబర్లలో మరో 30 ఎకరాలున్నాయి. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, మాగల్లు, విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం, గుంటూరు జిల్లాలోని పెరికలపూడి, చిరవూరు, ప్రకాశం జిల్లాలోని హాజీపురం, దొడ్డిచింతల, వీరగారెడ్డిపల్లి వీరాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 50ఎకరాల భూములున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో వెయ్యి ఎకరాలకుపైగా భూములున్నాయి. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం పేరిట ఉన్న భూముల్లో 1150 ఎకరాల వరకూ ఆక్రమణల్లో ఉన్నట్టు తేలింది. తెలంగాణలోని భద్రాచలం ఆలయం భూముల్లో 56 ఎకరాలు (కౌలు రైతులు సాగుచేస్తున్న భూమితోపాటు ఖాళీగా ఉన్న భూములు) మాత్రమే ఆలయం అధీనంలో ఉన్నాయి. ఏపీలోని భూముల్లో 123 ఎకరాల భూమి కౌలు రైతులు చేస్తుండగా, మరో 906 ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నాయి. దేవస్థానం అధీనంలో కేవలం 19 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఆక్రమణల్లో ఉన్న భూములపై అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ముఖ్యకార్యదర్శి ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణలోని ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లోని సీతారామచంద్రస్వామి భూములను ఆక్రమణల నుంచి తప్పించేందుకు రెవెన్యూ శాఖ ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలోని దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం భాద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం. భద్రాచలంతో పాటు వేములవాడ, యాదగిరిగుట్ట, బాసర, ఆలంపూర్, కాళేశ్వరం, ధర్మపురి తదితర ఆలయాలకూ భూములున్నాయి.
దేవాలయాల పరిపాలనకు కేంద్ర బిందువుగా దేవాదాయ కమిషనర్ కార్యాలయం కొనసాగుతోంది. చాలా రోజుల నుంచి కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్ ఇంచార్జి కమిషనర్‌గా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల ఆలయాల ఆస్తుల పరిరక్షణ ఇబ్బందికరంగా మారింది. భద్రాచలం ఆలయం ఇఓకు అధికారాలు ఉన్నప్పటికీ, రాష్టస్థ్రాయిలో ఉన్నతాధికారి లేకపోవడం వల్ల పరిపాలనాపరంగా చిక్కులు ఏర్పడుతున్నాయి. అడిషనల్ కమిషనర్లు ఉన్నప్పటికీ వారి పాత్ర అంతంతమాత్రంగానే ఉంది.
ఆలయాల ఆస్తులను కాపాడతామంటూ దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తరచూ ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దేవాలయ భూముల పరిరక్షణకు, ఆక్రమణల్లోని భూములను వెనక్కి తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి.