రాష్ట్రీయం

నీటి సర్దుబాటు ఉన్న జలాలే పంచుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న 34 టిఎంసి నీటిలో ఆంధ్రకు 18.5 టిఎంసి, తెలంగాణకు 15.5 టిఎంసి జలాలు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. తక్షణం నాగార్జున సాగర్ కుడి కాల్వకు 6వేల క్యూసెక్కులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల కోసం 5 టిఎంసి జలాలు విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. జలసౌధలో బుధవారం కృష్ణా బోర్డు చైర్మన్ హల్దార్ అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులతో బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. ఇరు రాష్ట్రాలూ ఎవరి వాదనలు వారు వినిపించడంతో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 12న కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలపై అధ్యయనానికి వస్తున్న కేంద్ర నిపుణుల బృందం దృష్టికి కేటాయింపుల వ్యవహారం తీసుకెళ్లాలని రెండు రాష్ట్రాలూ నిర్ణయించుకున్నాయి. అయితే నిపుణుల బృందం చెప్పే దానికి కట్టుబడి ఉండాలా? లేదా? అన్న విషయంపై ఇరు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి వచ్చినట్టు లేదు. ఇలాఉండగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం 5 టిఎంసి జలాల విడుదలకు గతంలో జరిగిన బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ అమలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ఆరోపించగా, దీంట్లో వాస్తవం లేదని మంచినీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం రుజువులు చూపింది.
ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకపోవడం వల్లే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాపోయింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపిణీ ఏ నిష్పత్తిలో జరగాలన్న అంశంపై బోర్డు చర్చించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రకు జరిగిన 811 టిఎంసిలో 299: 512 నిష్పత్తిలో పంపిణీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. నీటి పంపిణీపై ఎటూ తేల్చకపోతే బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఏవిధంగా అంగీకరిస్తామని తెలంగాణ ప్రశ్నించింది. నీటి ట్రాన్సిట్ నష్టాలకు తమ బాధ్యత లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కాగా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో 48చోట్ల టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఇవేకాకుండా మరో 14చోట్ల టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా ఆంధ్ర సర్కారు నిరాకరించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టిసీమకు గోదావరి జలాలు తరలించడానికి బదులుగా తమకు కృష్ణా జలాల్లో అదనంగా 45 టిఎంసి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో భాగం కాదని అలాంటప్పుడు అదనంగా నీటి వాటా ఇవ్వలేమని ఆంధ్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండానే నీటి వాటా ఎలా ఇస్తామని ప్రశ్నించింది. పరస్పర వాదనలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర నిపుణుల బృందం దృష్టికి తీసుకెళ్లాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, సభ్యుడు బాలన్, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆంధ్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌రావు, తెలంగాణ ఇఎన్‌సి మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ఇఎన్‌సి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీకి హాజరైన ఆంధ్ర, తెలంగాణ ప్రతినిధులు