రాష్ట్రీయం

మహిళే.. మన కేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 10: పవిత్ర నదీ సంగమ ప్రాంతంలో జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు నిర్వహణ అనిర్వచనీయ ఆనందాన్నిస్తుందని ఏపీ సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద బౌద్ధగురువు దలైలామా, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులతో కలిసి జాతీయ మహిళా కాంగ్రెస్‌ను ప్రారంభించారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ను ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించడం అదృష్టమన్నారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, వారిని చైతన్యవంతులు చేసేందుకు ఈ సదస్సే వేదిక కావాలన్నారు. రాజకీయ, సాంఘిక, సాంకేతిక రంగాల్లో నాయకత్వ స్థాయికి మహిళలు ఎదిగారని, మరింత పురోగతి సాధనకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అమరావతి నుంచే నాగార్జునుడు బౌద్ధాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేశాడని, అలాంటి చారిత్రాత్మక ప్రదేశం రాష్ట్ర రాజధాని కావడం అదృష్టమన్నారు. మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేసింది దివంగత ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప సంస్కరణ ఎన్టీఆర్‌దని గుర్తు చేస్తూ, విద్యాపరంగా మహిళలను ప్రోత్సహించేందుకు 80వ దశకంలోనే పద్మావతి వర్శిటీని నెలకొల్పారన్నారు. రాజకీయంగానూ మహిళలను అత్యున్నత స్థానంలో నిలిపాలన్న ఉద్దేశంతో, స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళల ప్రాతినిథ్యం అన్ని రంగాల్లో పెరగాలని, అందుకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుందన్నారు. మెడికల్, ఇంజనీరింగ్ విద్యలో 50 శాతం మహిళలు ఉంటున్నారంటే, ఆనాడు ఎన్టీఆర్ వేసిన బాటలేనన్నారు. రాష్ట్రంలో 90 లక్షల డ్వాక్రా సంఘాల మహిళలు స్వయంసమృద్ధి సాధిస్తూ ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి 2017 జూన్‌నాటికి వంట గ్యాస్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. పారిశ్రామికీకరణలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ ఆంధ్ర దూసుకుపోతున్నదన్నారు. ఆర్టీసీ బస్‌ల్లోనూ డ్రైవర్లుగా మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రం సైతం మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, వారి సంక్షేమానికి అనేక కొత్త పథకాలు రూపొందిస్తోందని చంద్రబాబు తెలిపారు.
కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పురుషులకు సాధ్యంకానిది, ఒక ప్రాణికి జన్మనివ్వగల శక్తి తల్లికే ఉందని మాతృత్వపు గొప్పతనాన్ని ప్రస్తావించారు. మహిళా ప్రాముఖ్యతను వివరిస్తూ భారత్ మాతాకి జై అంటాం తప్ప, భారత్ పితాకి జై అనలేమని, ఇదీ మహిళాలోకానికి భారతీయులు ఇస్తున్న గౌరవమన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్ర్తి ఉంటుందని గుర్తు చేస్తూ, మహిళా సాధికారతపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించింది మహిళలేనన్నారు. పేదల కష్టం వెలకట్టలేనిదని అంటూ, మహిళల స్థితిగతులు మెరుగుపడితేనే దేశ సౌభాగ్యం సాధ్యమన్న వివేకానంద సూక్తిని గుర్తు చేశారు. దేశంలో ప్రవహించే నదులను తల్లులుగా భావిస్తున్నామని అంటూనే, కొన్ని దేశాలే మహిళల పేర్లుతో ఉన్నాయని గుర్తు చేశారు. త్వరలోనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందగలదంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రధాని మోదీ ఈ విషయంలో ఆసక్తితో ఉన్నారని, ప్రతిపక్షాలు కూడా కలసిరావాలని కోరారు. ఇక్కడ నిర్వహించుకుంటున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు చరిత్ర సృష్టించబోతుందని జోస్యం చెప్పారు.
బౌద్ధ మత గురువు దలైలామా మాట్లాడుతూ ప్రపంచంలో తల్లిని మించిన గొప్ప గురువు ఎవరూ లేరన్నారు. మహిళల సాధికారతకు రాజ్యాంగపరమైన కృషి జరగడం శుభపరిణామన్నారు. నడుస్తున్న కాలంలో మహిళాభివృద్ధికి ప్రాధాన్యత పెరుగుతుందని అంటూ, విద్యా స్వావలంబన దిశగా కృషి చేస్తే ఈ శతాబ్దం మహిళలదేనన్నారు. లింగ వివక్ష వదిలేసి మానవత్వం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచం ఆయుధరహితం కావాలని ఆకాంక్షిస్తూ, అందులో మహిళల పాత్ర కీలకం అవుతుందన్నారు. శారీరకంగా సున్నితమైన మహిళల మానసికంగా బలవంతులని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తేనే మానవాళి సుభిక్షమవుతుందన్నారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబన కల్పించాలన్న ధ్యేయంతోనే గత మూడు మాసాలుగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నేడు జాతీయ మహిళా పార్లమెంట్‌ను నిర్వహించగలుగుతున్నామని శాసనసభా స్పీకర్, కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ ఇటీవల మహిళా సదస్సు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి, తాను హాజరయ్యామని, ఆ సదస్సు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించడానికి కంకణం కట్టుకున్నామన్నారు. ఇంతటి భారీ స్థాయిలో సదస్సు నిర్వహణకు సిఎం చంద్రబాబు ఎంతగానో సహకరించారన్నారు. దేశ, విదేశాల నుంచి ఇంత భారీ సంఖ్యలో మహిళలు తరలిరావటం సదస్సు విజయవంతానికి కారణమన్నారు. ఈ సదస్సు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించగలదన్నారు. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు కన్వీనర్ రాహుల్ వి కారాద్ మాట్లాడుతూ మహిళాభివృద్ధిని కాంక్షిస్తూనే సిఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మహిళా శక్తి దేశాభివృద్ధికి సూచిక అన్న అంబేద్కర్ భావనకు నేటి సదస్సు నిదర్శనమన్నారు. గ్రామీణ మహిళల్లో చైతన్యమే అభివృద్ధి సంకేతమన్నారు. పాండిచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నరు కిరణ్ బేడీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌పై అన్ని రాష్ట్రాల ప్రజలు ముందుకొస్తేనే క్లీన్ ఇండియా సాధ్యమన్నారు. ఇటువంటి మహిళా సదస్సులు ఇక ఏటా నిర్వహించుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ స్పీకర్ సిరిన్ షర్మిన్ చౌదరి మాట్లాడుతూ రాజకీయ సాధికారత ఇప్పుడు మహిళలకు అవసరమన్నారు. దీంతో కొత్త నాయకత్వ శక్తి పుట్టుకొస్తుందని, ప్రజాస్వామ్యంలో రాజకీయ ఐక్యత సాధ్యమవుతుందన్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్నారు. శ్రీలంక ప్రతినిధి మైథిలి విక్రమసింఘే మాట్లాడుతూ ‘ఆమె కలను నెరవేర్చుకోడానికి ఆమె ప్రయత్నించాలి’ అంటూ మహిళకు కవితాత్మకంగా పిలుపునిచ్చారు. సదస్సులో ప్రముఖ సినీ నటి మనీషా కోయిరాల, ఇలాబెన్ భట్ తదితర ప్రముఖులు మాట్లాడారు. మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరైన ప్రముఖులను ముఖ్యమంత్రి దుశ్శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందించారు. సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

చిత్రం...జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం వేదికపై సిఎం చంద్రబాబు, కిరణ్‌బేడీ, దలైలామా, వెంకయ్యనాయుడు, ఇలా బెన్ బట్, శిరీన్ షర్మిన్ చౌదరి, మనీషా కోయిరాలా, మంత్రి పీతల సుజాత, స్పీకర్ కోడెల, నన్నపనేని రాజకుమారి.