రాష్ట్రీయం

కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై క్షేత్రస్థాయి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాష్ట్ర విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చడానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ చొరవ తీసుకున్నట్టుగానే జల వివాదాల పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ వాటాలపై తగువుపడుతున్నాయి. అలాగే కృష్ణానదిపై ఉన్న ఇతర ప్రాజెక్టులకు చట్టబద్ధతపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాల తరలింపుమరో ప్రధానమైన వివాదం. ఈ అంశాలపై కృష్ణాబోర్డు ఇదివరకే అనేకమార్లు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులన్నింటినీ తన పరిధిలోకి తీసుకోనున్నట్టు యాజమాన్య బోర్డు నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జల వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టుల మాన్యువల్స్‌కు అంగీకరించేది లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఫిర్యాదు చేసింది. అయితే జల వివాదాల ట్రిబ్యునల్స్ తీర్పులు, రాష్ట్ర విభజన చట్టం సిఫారసుల మేరకు నదీ జలాల పంపిణీ జరగాలని ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కార మార్గం చూపడానికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఎకె బజాజ్ నేతృత్వంలో ఐదుగురి నిపుణులతో కేంద్ర జల వనరుల శాఖ కమిటీని నియమించింది. ఎకె బజాజ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తొలిసారి ఆదివారం రాష్ట్రానికి రానుంది. ఆ రోజు కృష్ణాబోర్డుతో చర్చించిన అనంతరం ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది.
ప్రాజెక్టుల పరిశీలన పూర్తి అయిన తర్వాత ఇరు రాష్ట్రాల వాదనలను కమిటీ వినిన తర్వాత తన నివేదికను కేంద్ర జల వనరులశాఖకు బజాజ్ కమిటీ అందజేయనుంది. కమిటీ ప్రధానంగా అధ్యయనం చేయనున్న అంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 80 టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు తరలించడాన్ని పరిశీలించనుంది. గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు వినియోగించుకోవడానికి బదులుగా నాగార్జునసాగర్‌కు ఎగువనున్న తెలంగాణ, కర్నాటక, మహారాష్టల్రకు అదనంగా నీరు కేటాయించాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయింది. దీంతో తమకు కృష్ణా జలాల్లో అదనంగా 45 టిఎంసిల నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, పట్టిసీమ ఎత్తిపోతల పోలవరంలో భాగం కాదనీ, అలాంటప్పుడు అదనంగా నీటిని ఎలా కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల వాదనలను బజాజ్ కమిటీ పరిశీలించ పరిష్కారం మార్గం చూపనుంది. కృష్ణానది జలాల ఆధారంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి లేదని వాదిస్తుండగా, దీనికి ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి కేటాయింపులు జరిగాయని తెలంగాణ వాదిస్తుంది. అనుమతి లేకుండానే పట్టిసీమ నిర్మించగా లేనిదీ తాము పాలమూరు-రంగారెడ్డి నిర్మిస్తే తప్పేంటన్నది తెలంగాణ వాదన. అలాగే గోదావరి జలాలను హైదరాబాద్ తరలించగా లేనిదీ తాము కృష్ణా డెల్టాకు తీసుకెళ్తే తప్పేంటనీ ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి వాటాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఒకవైపు ట్రిబ్యునల్ తీర్పులు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా నీటి వాటాలు ఎలా తేలుస్తామని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. ఈ వివాదాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించడానికి రెండు రాష్ట్రాల్లో ఎకె బజాజ్ నిపుణుల కమిటీ పర్యటిస్తుంది. కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి సమర్పించనున్న నివేదికనే భవిష్యత్‌లో కీలకంగా మారనుంది.