రాష్ట్రీయం

రైల్వే జోన్ రానట్టే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: రైల్వే జోన్ వస్తోందని ఆశపడుతున్న విశాఖ ప్రజల ఆశలపై నీళ్లు చల్లేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? దేశంలో కొత్త రైల్వే జోన్‌లు ఏర్పాటు చేయద్దంటూ వివేక్ దేవరాయ్ ఇచ్చిన నివేదికను అమలు చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్పా లి. భారతీయ రైల్వేలో 17 జోన్‌లు ఉన్నాయి. ఇన్ని జోన్‌లు ఉండడం వలన వ్యయం భారీగా పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం భావించి, వివేక్ దేవరాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. ఉన్న 17 జోన్‌లను తొమ్మిదికి తగ్గించడం లేదా ఆరు రీజియన్లుగా ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. ప్రస్తుతం దేవరాయ్ ప్లానింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన వివిధ అంశాలపై ఇచ్చిన నివేదికలను కేంద్రం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. దేవరాయ్ ఇచ్చిన నివేదికలో భాగంగానే రైల్వే బడ్జెట్‌ను రద్దు చేశారని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌కంటూ ఒక రైల్వే జోన్ లేదన్న వాదనను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. దేశంలోని ఐదు రాష్ట్రాలకు రైల్వే జోన్లు లేవు. అవన్నీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర పరోక్ష సంకేతాలను రాష్ట్రానికి పంపించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవరాయ్ నివేదికను కేంద్రం అమలు చేస్తే, కొత్త రైల్వే జోన్ ప్రసక్తే ఉండదు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఖుర్దా, సంబల్‌పూర్, వాల్తేరు డివిజన్‌లు ఉన్నాయి. ఖుర్దా, సంబల్‌పూర్‌లలో సుమారు 19 వేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. ఒక్క వాల్తేరు డివిజన్‌లోనే 19 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. అటువంటప్పుడు వాల్తేరు డివిజన్‌ను వదులుకుంటే, ఈస్ట్‌కోస్ట్ రైల్వే నిర్వీర్యమవుతుందని ఈస్ట్‌కోస్ట్ రైల్వేలోని కీలక నేతలు వాదిస్తున్నారు. వీరి వాదనను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమర్థిస్తున్నారు. ఒకవేళ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనుకుంటే, ఒడిశా హద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉన్నాయో, ఆ ప్రాంతమంతా ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విలీనం చేయాలని కోరుతున్నారట.!
భువనేశ్వర్ హెడ్ క్వార్టర్‌గా పనిచేస్తున్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లో వాల్తేరు, ఖుర్దా, సంబల్‌పూర్ డివిజన్‌లు ఉన్నాయి. ఇందులో రెండేళ్ల కిందటి వరకు వాల్తేరు డివిజన్‌కే అధిక ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు ఖుర్దా డివిజన్ వాల్తేరు డివిజన్ కన్నా అధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు డివిజన్ ఆదాయం 7,165 కోట్ల రూపాయలు అయితే, ఖుర్దా డివిజన్ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారికంగా ప్రకటించిన లెక్కలు ఇవి. ఎవ్వరూ ఎన్నడూ ఊహించని విధంగా ఖుర్దా ఆదాయం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ రెండు డివిజన్ల ఆదాయం కలిపితే దాదాపూ 16 వేల కోట్లకు చేరుకుంది. భారతీయ రైల్వేలో ఏ ఒక్క జోన్‌కు ఇంత ఆదాయం లేదు.
భారత ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపి తీరం వెంబడి మరిన్ని పోర్టులు రానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో షిప్ ట్రాఫిక్ పెరిగింది. ఇటువంటి తరుణంలో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వస్తే, జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు తదితర రైల్వే స్టేషన్లు ఆధునీకరించడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని విస్తరించడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి. అప్పుడు గూడ్స్ రైళ్ళ సంఖ్యను మరింతగా పెంచడానికి అవకాశం ఉంటుంది.
విశాఖ కేంద్రంగా ఇటీవల జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిలో ఏ మేరకు పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వచ్చేదీ ఇప్పటికీ స్పష్టత లేకపోయినా, వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో రైల్ కనెక్టివిటీదే అగ్రతాంబూలం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్న విషయాన్ని అధికార పార్టీలన్నీ మరిచిపోవడం శోచనీయం. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల ఒక లేఖ రాశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావును ప్రశ్నించగా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకుండా ఒడిశా అడ్డుపడుతోందని అన్నారు. జోన్‌కు సంబంధించిన ఫైల్ ప్రధాని ముందు ఉందన్నారు.
రైల్వే శ్రామిక యూనియన్ డివిజనల్ నాయకులు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఒడిశా ప్రజలు అడ్డుపడడం లేదని, వాల్తేరు డివిజన్‌ను వదులుకుంటే, ఎదురయ్యే ఇబ్బందులను గమనించి ఒడిశా ముఖ్యమంత్రి వాల్తేరును ఈస్ట్‌కోస్ట్ జోన్ నుంచి వదులుకోడానికి ఇష్టపడడం లేదని అన్నారు.