రాష్ట్రీయం

రోహిత్ దళితుడు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: గత ఏడాది జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల దళితుడు కాడని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దాండే మరోమారు తేల్చి చెప్పారు. ఈ మేరకు నివేదిక రూపొందించామని కలెక్టర్ మంగళవారం నాడు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. రోహిత్ వేముల కుల ధృవీకరణపై అనేక ఫిర్యాదులు రావడంతో మరో మారు ఈ అంశంపై లోతైన అధ్యయనం చేశామని, రోహిత్ వేముల తండ్రి కాని, తల్లి కాని దళితులు కాదనేది స్పష్టమైందని అన్నారు. అందుకు తగ్గ రికార్డులను రోహిత్ కుటుంబ సభ్యులు రుజువు చేయలేకపోయారని తెలిపారు. దాంతో రోహిత్ దళితుడు కాదని, వడ్డెర కులస్థుడని తేలిందని అన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న నిబంధనల మేరకు మూడు రోజుల క్రితం రోహిత్ కుటుంబ సభ్యులకు ఈ అంశంపై నోటీసులు ఇచ్చామని, దానిపై వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వడ్డెర కులస్థుడేనని తేలినట్టయితే, ఎస్సీ సర్ట్ఫికేట్‌ను అక్రమమార్గంలో సంపాదించారనే ఆరోపణలతో వేముల రోహిత్ తల్లి రాధిక, తండ్రి మణికుమార్‌లపై కేసు నమోదుచేసే అవకాశం ఉందని తెలిసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులయ్యారని పేర్కొంటూ ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ అప్పారావు, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2017 జనవరి 17 నాటికి ఏడాది పూర్తికావడంతో వీరు ముగ్గురిని అరెస్టు చేయాలని, విసిని తొలగించాలని పేర్కొంటూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ దర్యాప్తు జరిపి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో రోహిత్ దళితుడేనని పేర్కొన్నారు. అయితే మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్వహించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిటీ మాత్రం రోహిత్ వేముల దళితుడు కాదని తేల్చింది. దాంతో మరో మారు సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్రం గుంటూరు కలెక్టర్‌ను ఆదేశించింది.
రోహిత్ వేముల దళితుడు కాదని చెప్పడం బిజెపి కుట్ర అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పేర్కొన్నారు. దీని వెనుక బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్‌ల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ కేసును పక్కదారి పట్టించేందుకు తొలి నుండి ఈ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు.
రోహిత్ వేముల కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి నాగయ్య పేర్కొన్నారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం నుండి కాపాడేందుకే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.