రాష్ట్రీయం

అమరావతిలో అందరికీ ఇళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి అమరావతిలో 139 ఎకరాల్లో 9,061 మంది ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నివాసాలు నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మించే నివాస సముదాయాల కోసం అందరికీ నచ్చే, అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. నెలనెలా చిన్నచిన్న మొత్తాలను ఈఎంఐల రూపంలో చెల్లిస్తూ రుణాలు తీర్చుకునే సౌలభ్యం ఉండాలన్నారు. వీలున్నంత తక్కువ వ్యయంతో అత్యంత నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని స్పష్టం చేశారు. రాజధానికి ఇప్పటికే తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, భవిష్యత్‌లో అదనంగా వచ్చే వారి కోసం నివాస సముదాయాలు నిర్మించేందుకు వీలుగా భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సిఆర్‌డిఎపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికల వివరాలను తెలుసుకున్నారు. మొత్తం ఐదు కేటగిరీల్లో జీ+8 విధానంలో అపార్టుమెంట్లు నిర్మించేలా రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. మొదటి కేటగిరీలో జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా సర్వీసు అధికారులు, రెండు, మూడు కేటగిరీల్లో గెజిటెడ్ అధికారులు, నాలుగో కేటగిరీ కింద నాన్ గెజిటెడ్ అధికారులు, ఐదో కేటగిరీలో క్లాస్ 4ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లను చేర్చినట్టు వివరించారు. 2,900 చ.అ నుంచి 900 చ.అ విస్తీర్ణంలో వివిధ కేటగిరీల్లో ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో 7 రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందని, ట్విన్ టవర్స్ నిర్మించడానికి డిజైన్లు సిద్ధం అవుతున్నాయని తెలిపారు.
ఇక నుంచి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలను అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వేగం, నాణ్యత, సృజనాత్మకత అనేవి అధికారులకు ప్రమాణాలుగా వుండాలని అన్నారు. ఎక్కడా రాజీపడకుండా రాజధాని నిర్మాణం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి యువ ప్రతిభావంతులను నియమించుకోవడం ద్వారా కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. సమీక్షలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజవౌళి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యదర్శి అజయ్‌జైన్, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ఎడిసి చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారధి భాస్కర్, విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.

చిత్రం..సిఆర్‌డిఏపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు