రాష్ట్రీయం

కృష్ణా జలాల పంపకం మా పని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15:కృష్ణా జలాల వివాదంపై ఏర్పాటు చేసిన నిపుణల కమిటీ బజాజ్ కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. సోమవారం తెలంగాణ వాదనలు, విజయవాడలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్న నిపుణుల కమిటీ బుధవారం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో హైదరాబాద్‌లో సమావేశం అయింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, మిగులు కృష్ణా నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం తమ పరిధిలోని అంశం కాదని బజాజ్ కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విధి విధానాలలో ఈ అంశం ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సిడబ్ల్యుసి రిటైర్డ్ సిఇఆర్ విద్యాసాగర్‌రావు గుర్తు చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఎస్‌కె జోషి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కమిటీకి
వివరించారు. సోమవారం నాటి తొలి సమావేశంలో పట్టిసీమ, పోలవరంలలో వాటా తేల్చే అంశం విధి విధానాల్లో ఉందన్న బజాజ్ కమిటీ విజయవాడనుంచి రాగానే మాట మార్చిందని విద్యాసాగర్‌రావు విమర్శించారు. పోలవరం ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తున్నందున మిగులు కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 45 టిఎంసిలు కేటాయించారని, వాటిని నాగార్జున సాగర్ ఎగువ భాగాన, కృష్ణా పరీవాహక ప్రాంతంలో వాడవలసి ఉన్నందున సింహభాగం అంటే 96శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుపట్టింది. పట్టిసీమలోనూ తెలంగాణకు 65శాతం, ఆంధ్రకు 35శాతం వాటాలు కేటాయించాలని వాదించింది. వాటాల కేటాయింపువ్యవహారం ట్రిబ్యునల్ పరిధిలో లేదని బజాజ్ కమిటీ తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందని తెలంగాణ అభిప్రాయపడింది.
కాగా, తెలంగాణలో చిన్న నీటి వనరులకు సంబంధించిన సమాచారం కోసం బజాజ్ కమిటీ ఉత్సాహం ప్రదర్శించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం, పట్టిసీమప్రాజెక్టుల ద్వారా ఏ మేరకు గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి వివరాలు సేకరించడంలో నిపుణుల కమిటీ విఫలమైందని విద్యాసాగర్‌రావు అన్నారు. కృష్ణా నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ ఖరారు చేయడానికి చాలా సమయం పడుతున్నందున ఈ లోగా తాత్కాలిక ప్రాతిపదికన నీటి వాడకంపై ఏర్పాట్లు జరగాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టింది. తెలంగాణ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని బజాజ్ కమిటీ తెలిపింది.
తన విధి విధానాలకు భిన్నంగా కమిటీ వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు మీడియా సమావేశంలో విమర్శించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి బజాజ్ కమిటీ పర్యటన వివరాలు తీసుకు వెళతానని చెప్పారు. గోదావరి నుంచి కృష్ణా నదిలోకి మళ్లించే జలాలు తమ పరిధి కాదని బజాజ్ కమిటీ మాట మార్చిందని విద్యాసాగర్‌రావు విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో బజాజ్ కమిటీకి సంబంధం లేదడం సరికాదని, మళ్లింపు అంశం కమిటీ బాధ్యతల్లో ప్రధానమైనదని తెలిపారు. ఈ విషయమై ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖతో నివృత్తి చేసుకోనున్నట్టు విద్యాసాగర్‌రావు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకంలో సుహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం, నిర్మాణాత్మక తోడ్పాటు లేకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయని స్పెషల్ సిఎస్ జోషి బజాజ్ కమిటీకి తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వచనాన్ని మళ్లీ ఖరారు చేయాలని ఆయన సూచించారు.