రాష్ట్రీయం

పేచీలతో పనులు కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు వాంఛనీయం కాదని సిఎం కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. రైతులు ఎవరైనా రైతులే. ఏ రాష్ట్రానికైనా రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రైతులకు కావాల్సింది నీరే తప్ప వివాదాలు కాదన్నారు. నీటి కోసం కోర్టుల చుట్టూ తిరగడంకన్నా, చర్చలతో పరిష్కారానికే తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఏటా సగటున నాలుగు వేల టిఎంసి జలాల లభ్యత ఉంటుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచన చేయాలి తప్ప, వివాదాలు వద్దని కెసిఆర్ హితవు పలికారు. తెలంగాణ, ఆంధ్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపిణీపై తలెత్తిన వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల శాఖ జస్టిస్ ఎకె బజాజ్ అధ్యక్షతన నియమించిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ ప్రగతి భవన్‌లో బుధవారం సిఎంను కలిసింది. ఈ సందర్భంగా నదీ జలాల వినియోగం, తెలంగాణకు జరిగిన అన్యాయం, భవిష్యత్‌లో రూపొందించాల్సిన సమగ్ర జల విధానం తదితర అంశాలను సిఎం వారికి వివరించారు. నీటి వనరుల విషయంలో సమైక్య రాష్ట్రంలో తమపట్ల కనబర్చిన వివక్షవల్ల 60 ఏళ్లు గోస పడ్డామని, ఈ కారణంగా తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ గోస తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని, తమకున్న వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామని సిఎం స్పష్టం చేశారు. నదీ జలాల వాడకానికి సంబంధించిన స్కీమ్-1, స్కీమ్-2 విధానాలను అమలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రాల మధ్య నీటి పంపకం ఎలా ఉండాలి? నీటి లభ్యత ఎక్కువగా ఉండి మిగులు జలాలు అందుబాటులో ఉన్నప్పుడు నీటి పంపిణీ ఎలా సాగాలి? అనే విషయంలో రెండు వేర్వేరు విధానాలు ఉండాలని కెసిఆర్ సూచించారు. ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్టల్రు పెద్ద సంఖ్యలో నదులపై డ్యామ్‌లు కట్టారని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాల మధ్య ఏ సమయంలో ఎవరెంత నీరు వాడుకోవాలనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిజైన్ మార్చడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకు ప్రయోజనం కలిగించారన్న కృతజ్ఞతతో అప్పటి ఇంజనీర్ కెఎల్ రావును ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నుకున్నారని సిఎం గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగాయన్నారు. సమైక్య రాష్ట్రానికి చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ కూడా తన ఎన్నికల సభలో ఈ ప్రాజెక్టుకు హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు ప్రాజెక్టు కడతామంటే అడ్డుపడుతున్నారన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలన్నారు. కానీ హైదరాబాద్‌కు మంచి నీళ్లు ఇవ్వడానికి మాత్రం అంగీకరించడం లేదని సిఎం కెసిఆర్ కమిటీవద్ద ప్రస్తావించారు. గోదావరిలో 3 వేల టిఎంసి, కృష్ణాలో 1200 టిఎంసి నీళ్లున్నాయి. తెలంగాణలో సాగునీటి అవసరాలు తీరడానికి వెయ్యి టిఎంసి నీరు చాలు అన్నారు. అలాగే తమకు గోదావరిలో 954 టిఎంసిల నీటి లభ్యత ఉంది. ఆ ప్రకారమే ప్రాజెక్టులకు డిజైన్ చేశామన్నారు. మా వాటా ప్రకారమే మేము నీటిని వాడుకుంటున్నాం. ఆంధ్ర కూడా అలాగే చేయాలని సిఎం సూచించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారు. దానికి బదులుగా కృష్ణా జలాల్లో తమకు వాటా పెంచాలని కెసిఆర్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి సంబంధించి విధానాన్ని, ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని సిఎం కెసిఆర్ కమిటీని కోరారు.